పదవి అంటే అధికారం కాదు.. ప్రజల మీద మమకారం అని నిరూపించామని వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకోసమే బ్రతికామని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు పరితపించామన్నారు. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని వైసీపీ ప్లీనరీ సమావేశాలను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేకర్‌రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్లీనరీకి హాజరైన వైసీపీ శ్రేణులను ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేశారు.
గుండె చెదరలేదు.. సంకల్పం మారలేదు
2009 నుండి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాం, 2012లో పార్టీ పెట్టుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్ళున్నా, ఎన్ని రాళ్ళు పడినా, ఎన్ని వ్యవస్థలు కత్తికట్టినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైఎస్సార్‌సీపీ అని గర్వంగా చెప్తున్నాం. ఈ మూడేళ్ల ప్రయాణం ఎన్నో పోరాటాల ప్రస్థానం. రైతులపై మమకారం అంటే ఇలా ఉంటుందని నిరూపించింది మన పాలన. మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్నికుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు.. సంకల్పం మారలేదు. నాకు ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడు నా చేయి వీడలేదు. మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. ఈ ప్రయాణంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, అభిమానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.