దేశానికి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్‌ని సీబీఐ స్వాధీనం చేసుకోవటం షాక్‌కు గురి చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఈ డ్రగ్స్ ద్వారా ఏం చేయాలనుకుందని ప్రశ్నించారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఏపీకి ఎలా చేరాయన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందనే తన భయాన్ని తాజా ఘటన ధ్రువీకరిస్తోందని మండిపడ్డారు. ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న వారిని పట్టుకుని శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
జగన్ ముఠా పాపాల పుట్ట బద్దలవుతోంది: లోకేశ్
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరానికి గురిచేసిందన్నారు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్ అని మండిపడ్డారు.
డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి: పవన్
వైసీపీ ప్రభుత్వం ఏపీని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాజాగా ఘటనతో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని ప్రభుత్వానికి సూచించారు.