ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మే విషయానికి సంబంధించిన వివాదం మళ్లీ మొదటకొచ్చింది. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో 69ని విడుదల చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించింది. అయితే ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యాజమానులు షాక్‌కు గురవుతున్నారు. టికెట్లను ఆన్‌లైన్ లో విక్రయించడం వరకు బాగానే ఉన్నప్పటికీ... టికెట్ల విక్రయాల తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయాన్ని ఎంఓయూలో పేర్కొనకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఎంవోయూపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ఆన్‌లైన్ విక్రయాలు ఫిలిం ఛాంబర్ ద్వారా నిర్వహిస్తామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. కావాలంటే ప్రభుత్వానికి లింక్ ఇస్తామని ఎగ్జిబిటర్ల లేఖలో తెలిపారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ గేట్‌వే ద్వారానే టికెట్లు విక్రయించాలని జీవోలో పేర్కొన్నారు. అయితే, ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వ చేతుల్లో చిక్కినట్లేనని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. జులై 2 లోపు సంతకం చేయకపోతే లైసెన్స్లు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆందోళనపై సీఎంకు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. ఒప్పందంపై సంతకాలు చేసేది లేదని, థియేటర్లు మూసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆందోళనను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది.