రాష్ట్రపతి ఎన్నికల వేళ అనుకోని అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది. గత 8 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు రాష్ట్రపతి ఎన్నికలు వరంలా మారాయి. కానీ జగన్ ప్రభుత్వం దీనిని ఎలా వాడుకుంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల వేళ ఎన్‌డీఏ అభ్యర్థి గెలవాలంటే వైసీపీ మద్దతు కీలకం కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ మద్దతు లేకుంటే ఎన్‌డీఏ అభ్యర్థి గెలిచే అవకాశమే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నమే చేస్తుంది. నయానో భయానో, అవసరమైతే అవసరాలు తీర్చో మద్దతు కూడగడుతుంది. తమ అభ్యర్థిని గెలిపించుకుంటుంది.
వైసీపీ ప్రభుత్వం ఏమి చేయబోతోంది ?
ప్రత్యేకహోదా ఇస్తేనే ఎన్‌డీఏకి మద్దతు ఉంటుంది లేదంటే రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉంటాం అని ఒక్క స్టేట్‌మెంట్ చాలు కేంద్రం మెడలు వంచడానికి ? మరి జగన్ ప్రభుత్వం ఏమి చేస్తుంది. ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. అవసరానికి అడిగినంత అప్పు ఇప్పిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం ఎదురు నిలిచే సాహసం చేయగలదా ? కేసుల విషయంలో లోపాయికారిగా సహకరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని బెదిరించే ధైర్యం చేయగలదా ? అనేది కాలమే సమాధాన చెప్పాలి.