కుప్పంలో పోటీ చేసే విషయంపై హీరో విశాల్ తేల్చేశారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను విశాల్ కొట్టిపారేశాడు. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరాడు. అసలు పోటీ విషయమే తనకు తెలియదని, ఎవరూ తనని సంప్రదించలేదని ట్విటర్ వేదికగా విశాల్ ప్రకటించాడు. ఈ వార్తలు ఎలా వచ్చాయో తనకు అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. తాను సినిమాలు చేసుకుంటున్నానని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాలని కానీ.. చంద్రబాబుపై పోటీ చేయాలని తనకు ఎటువంటి ఆలోచనా లేదని ట్వీట్‌లో విశాల్ పేర్కొన్నాడు.
హీరో విశాల్‌ను కుప్పం బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తున్నట్టు ఇటీవల జోరుగానే ప్రచారం జరిగింది. ఆయనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పోటీగా నిలిపేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు సాగించినట్టు వార్తలొచ్చాయి. తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ ఆయన పరిచయమే. ఆయన తండ్రి జీకే రెడ్డి సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త. కుప్పం ప్రాంతంలో ఆయనకు గ్రానైట్ గనులు, పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇలా కుప్పం ప్రాంతంతో విశాల్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని... ఆయనను చంద్రబాబుపై పోటీకి నిలపాలని వైసీపీ యోచిస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై నేడు విశాల్ ప్రకటించారు.