దాదాపు మూడేళ్ల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు వెళ్లనున్నారు. మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు స్వయంగా విజయవాడ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజయవాడ రానున్నారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడ కేంద్రంగా జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలలో తెలంగాణ సీఎం పాల్గొననున్నారు. ఈ సభకు కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20 దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలు హాజరు కానున్నారు.
అక్టోబర్ 14 నుంచి 18 విజయవాడలో జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలకు బీజేపీయేతర ముఖ్యమంత్రులకు ఆహ్వానం వెళ్లింది. తెలంగాణ, కేరళ, బీహార్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీపీఐ ఆహ్వానం పంపింది. సీపీఐ జాతీయ నేతలు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తున్నారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగనుండగా... అక్టోబర్ 16న బీజేపీయేతర సీఎంలు హాజరుకావాలని సీపీఐ కోరుతోంది. అదే రోజు బీజేపీయేతర సీఎంల భేటీ నిర్వహించి జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చించాలని సీపీఐ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.