తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్ళతో పాటు విద్యాసంస్థల్లో ఐటీ అధికారుల తనిఖీలు ముగిశాయి. భారీగా నగదుతో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించి కీలక సమాచారం లభించినట్లు తెలిసింది.
డొనేషన్‌ల రూపంలో రూ. 100 కోట్లు!
కాగా ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో సీట్లు కోసం రూ. 100 కోట్ల డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంజినీరింగ్ కాలేజ్‌లో కేవలం మూడు సంవత్సరాల కాలంలో రూ. 100 కోట్ల డొనేషన్ల పేరుతో వసూలు చేశారని మహేందర్ రెడ్డితో ఐటీ సంతకం తీసుకుంది. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని ఐటీ అధికారులతో వాదనకు దిగారు. తమ కాలేజ్‌లో జరిగే ప్రతి లావాదేవీకి లెక్కలు ఉంటాయని మంత్రి చెబుతున్నారు. రూ. 100 కోట్ల డొనేషన్ల పంచనామాపై సంతకం తీసుకున్న ఐటీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డి సహా ఆయన కుమారుడు, అల్లుడికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేశారు.
కాగా మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ. 6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడు నివాసంలో రూ. 12 లక్షలు, మల్లారెడ్డి చిన్న కుమారుడి నివాసంలో రూ. 6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు నివాసంలో రూ. 3 కోట్లు, ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో రూ. 15 కోట్లు , త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లు, రఘనందన్ రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో 1. 5 కోట్లు, సుధీర్ రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు.
అప్రమత్తమైన ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు !
మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీల్లో జరిగిన ఐటీ సోదాలతో ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. ఇంజినీరింగ్, వైద్యకళాశాలల్లో డొనేషన్‌తో సీటు పొందిన విద్యార్థులకు ఫోన్‌లు చేస్తున్నాయి. డొనేషన్ చెల్లించినట్లు సమాచారం ఎవ్వరికీ ఇవ్వకండి, మాకు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి. అంటూ ఫోన్‌ల తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నట్లు సమాచారం.
లక్షల్లో డొనేషన్లు వసూలు !
నగర శివారుల్లోని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రవేశాల కోసం ఏకంగా లక్షల్లో డొనేషన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కళాశాల స్థాయి, బ్రాంచిని బట్టి రూ. 6 లక్షల నుండి 15 లక్షలు వరకు తీసుకున్నాయి. కొన్ని ప్రముఖ కళాశాలలు బీటెక్ కంప్యూటర్ సైన్స్‌కు రూ. 12 ` 15 లక్షలు వసూలు చేశాయి. మిగిలిన ఫీజలు దీనికి అదనం. ఒకే దఫాగా నగదు రూపంలో తీసుకున్న డొనేషన్ సొమ్ముకు ఎలాంటి రసీదులు ఇవ్వరు. ఇవన్నీ కాలేజ్ ఆర్థిక కార్యాకలాపాల్లో చూపించరు. ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి.