ఇంటర్నెట్‌ చెడు ప్రభావాల నుండి పిల్లల్ని దూరం చేయండి !

0

ఇంటర్నెట్‌...ఇప్పుడు పెద్దలపైనే కాదు, చిన్నారులపై దీని ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. ఎంతగా అంటే, స్కూలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు నెట్‌లోనే బ్రౌజింగ్‌ చేసేంత. చదువులు కంటే ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు ఇంటర్నెట్‌ను వాడటంలో పెద్దలను మించిపోతున్నారు. స్నేహితులతో ఆడుకోవాల్సిన పసి వయస్సులో ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం ఆరాపడిపోతున్నారు. ఇంటర్నెట్‌ లో మంచి విషయాల కంటే చెడు విషయాలే చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నడంలో సందేహం లేదు. గంటల తరబడి ఆన్‌లైన్‌లోనే గడిపే చిన్నారులు ఎంతోమంది. ఇంటర్నెట్‌ లో ఎక్కువ సమయం గడిపే పిల్లలపై వారి తల్లిదండ్రులు, స్కూల్‌ టీచర్లు పిల్లల భవిష్యత్తుపై ఎప్పుడూ ఒక కంట కనిపెడతూనే ఉండాలంటున్నారు నిపుణులు. 

5 ఏళ్ళ నుండి 11 ఏళ్ళ మధ్య...

అన్నం తినకుండా మారం చేస్తున్న పిల్లల్ని దారిలో పెట్టడం కోసం యూట్యూబ్‌లో బొమ్మలు చూపించి అన్నం తినిపించే అమ్మలను నేడు ప్రతీ ఇంట్లో మనం చూస్తున్నాం. అలాగే ఇంటి పనుల్లో పిల్లలు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ను ఇచ్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల్ని చూస్తూనే ఉన్నాం. అయితే, అదే అలవాటుగా మారితే ? ఆలోచించేందుకే కష్టంగా ఉంది కదూ.  అయితే, ఇప్పటికే ఆ నష్టం జరిగిపోయింది. దేశంలో చాలా మంది పిల్లలు ఇంటర్నెట్‌కు బాగా అలవాటు పడిపోయారు. చదువుకు దూరం అయ్యి అంతర్జాలానికి బానిసలుగా మారారు. ఎక్కువ సేపు నెట్‌ చూడకు అని ఏ మాత్రం పెద్దలు వారించిన పిల్లలు వినే పనిస్థితి లేదు. కొందరు పిల్లలు విపరీతంగా ప్రవర్తించటం గమనిస్తున్నాము. మరికొందరైతే మొండిగా తయారై తల్లిదండ్రులపైనే ఎదురు తిరిగి మాట్లాడటం, వాదించటం జరుగుతోంది. పిల్లల్లో ఈ పరిస్థితులను దూరం చేయాలంటే పిల్లలను ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచటమే ఉత్తమం.

11 ఏళ్ళ నుండి 17 ఏళ్ళ మధ్య...

వయస్సును బట్టి పిల్లలు ఎదుర్కొనే సమస్యలు మారుతున్నాయి. ఇంటర్నెట్‌ ఎక్కువగా వాడే చిన్నారుల్లో చెడు వ్యసనాలకు అలవాటుపడి పోయే పరిస్థితి ఉంది. ఫేస్‌బుక్‌ లో పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా అకౌంట్లు ఓపెన్‌ చేసి ఎంతో మందిని ఫ్రెండ్స్‌ ని చేసుకోవడమే కాదు, ఫోటోలు షేర్‌ చేసుకోవడం కూడా చేస్తుంటారు. ‘ఫేస్‌బుక్‌’’ లో ఎక్కువగా పెద్దవాళ్ళుంటారు కాబట్టి ‘ఇన్‌స్టాగ్రామ్‌’’ లో ఫ్రెండ్స్‌ చేసుకుని ఫోటోలు షేర్‌ చేసుకుంటుంటారు. ఇందులో ఎక్కువగా చిన్నపిల్లలు, టీనేజర్లు వుంటారు. ఏ కొత్త పరికరం అయినా అందరికీ అందుబాటులోకి వచ్చినపుడు దాని ద్వారా ఎన్నో మంచి జరిగే అవకాశాలుంటాయి అలాగే చెడు కూడా జరిగే అవకాశం కూడా వుంటుంది. అందుకని మన జాగ్రత్తలో మనం వుండడం చాలా అవసరం ముఖ్యంగా ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో ఎలాంటివారైనా దూరే అవకాశం వుంది. అన్ని తెలిసిన పెద్ద వాళ్ళే ఎన్నో మోసాలకు గురి అవుతుంటే ఏ అభం శుభం తెలియని చిన్నారులు మోసకారుల చేతుల్లో మోసపోరని నమ్మకం ఏమిటి చెప్పండి? అశ్లీల వైబ్‌ సైట్లు, సోషల్‌ మీడియాలో ప్రేమ వంటి ఎన్నో రకాల చెడు ఆలోచనలతో భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఇంటర్నెట్‌ మొదలై (వరల్డ్‌ వైడ్‌ వెబ్‌) 30ఏళ్లు అవుతోంది. ఇదే ఏడాదిలో బాలల హక్కులపై యూఎన్‌ కన్వెన్షన్‌ ప్రారంభమై కూడా సరిగ్గా 30ఏళ్లు అవుతోంది. ఇంటర్నెట్‌ చిన్నారులపై ప్రభావం ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందిస్తూ గొప్ప కమ్యూనికేషన్‌ టూల్‌గా మారిపోయింది. కానీ, ఇదే టెక్నాలజీ.. చిన్నారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పిల్లలను ప్రమాదంలో పడేస్తుంది కూడా. మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సింది ఒకటే.. డిజిటల్‌ ప్రపంచంలో ఈ రోజు చిన్నారులకు ఎంతమేరకు సురక్షితమైన వాతావరణమంటే అవును అని చెప్పలేని పరిస్థితి. 

జాగ్రత్తలు తెలియజేయాలి

పిల్లలు తమ కంటే బాగా ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాలను చాలా బాగా ఉపయోగిస్తున్నారని, తమకు వాటిని ఎలా వాడాలో సరిగా తెలియదని చాలా మంది తల్లితండ్రులు గొప్పగా చెప్పుకోవడం వింటుంటాము మనం. వారికి తెలియని విషయం ఏమిటంటే మనం జాగ్రత్తగా వుండకపోతే ఎన్నో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని. కాబట్టి ఇపుడు మనం పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తెలియజేయాలి, తల్లితండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇందులోని సలహాలన్నీ ‘చిన్న పిల్లలు, ఇంటర్నెట్‌ ప్రభావం,’ అనే స్టడీ చేసిన వారు ఇచ్చినవి వున్నాయి. ముందు తల్లి తండ్రులు ఇంట్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తెచ్చినా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌ లో పిల్లలు ఏది పడితే అది చూడకుండా పేరంటల్‌ కంట్రోల్స్‌ అని సిస్టమ్‌ లో పిల్లలు పెద్దవాళ్ళ సైట్స్‌ లోకి వెళ్ళకుండా లాక్‌ చేయవచ్చు. అవి చేసినా మామూలు సోషల్‌ నెట్‌ వర్కులు చూసినా, అందులో చేరినా పర్వాలేదు అనుకోవచ్చు కానీ వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి విషయాలు అందరితో పంచుకుంటున్నారు లాంటి విషయాలు గమనిస్తూ వుండాలి.

స్వీయ నియంత్రణ 

పిల్లలతో అన్ని విషయాలు స్పష్టంగా,ప్రేమగా మాట్లాడుతూ వారితో కమ్యునికేషన్‌ గ్యాప్‌ రాకుండా చూసుకోవాలి. మీరు ఇంట్లో మీ స్వంతంగా పిల్లలు పాటించాల్సిన ఇంటర్నెట్‌ రూల్స్‌ పెట్టి వాటిని వారు తప్పకుండా పాటించేలా చూసుకోవాలి, ఉదాహరణకు రోజూ ఇంత సమయం కంటే ఎక్కువగా కంప్యూటర్‌ కానీ, లాప్‌టాప్‌ కానీ, సెల్‌ ఫోన్లో ఇంటర్నెట్‌ వాడకూడదని మీరే నిర్ణయించాలి. ఈ నియమాన్ని తూ.చ. తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య కుటుంబంలో ఎంత మంది ఉంటే వారందరి దగ్గర సెల్‌ఫోన్‌ ఉండటం పరిపాటి అయ్యింది. కానీ ఎవరి ఫోన్‌లో వారు తలదూర్చి ఎవరి ప్రపంచంలో వారు ఉండటం జరుగుతోంది. సెల్‌ఫోన్‌ వచ్చాక కుటుంబసభ్యులతో మనసు విప్పి మాట్లాడుకునే సమయం పూర్తిగా పోయింది. దీని వలన కుటుంబసంబంధ బాంధవ్యాలకు బీటలు వారుతున్నాయి అనేది సుస్పష్టం. దీనికి విరుగుడు ఏమిటంటే ఫోన్‌ని వినియోగించకుండా ఉండటం లేదా సాయంత్రం 8 గంటలు దగ్గర నుండి సెల్‌ఫోన్‌ని స్విఛ్చాఫ్‌ చేసి ఒక చోట పెట్టి కుటుంబసభ్యులతో కలసి మెలసి ఆనందాన్ని పంచుకోవడమే. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !