ఏమైనా చేసుకోండి , భయపడే ప్రసక్తే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

0


  • - ఐటీ, ఈడీ ఏది వచ్చినా నిలబడి కొట్లాడుతాం
  • - బీజేపీలో గెలిచేవాళ్లు లేరు కాబట్టి నేతలను గద్దల్లా తన్నుకుపోతుంది
  • - సిట్ విచారణకు రావడానికి బీఎల్ సంతోష్ కు ఎందుకు భయం
  • - బీజేపీది రాముడు పేరు చెప్పి రౌడీయిజం చేసే పద్ధతి


భారతీయ జనతా పార్టీ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పినా భయపడే ప్రస్తకే లేదని తేల్చిచెప్పారు. భయపడే తత్వం తెలంగాణ ప్రజల్లో లేదని, నిలబడి కొట్లాడుతామని స్పష్టం చేశారు. రాజకీయంగా బలంగా ఎదిగిన పార్టీ నాయకులను గద్దల్లాగా ఎత్తుకు పోవాలన్న ఆలోచన తప్ప బిజెపి కి ఇంకోటి ఏమీ లేదని స్పష్టం చేశారు. రాముడి పేరు చెప్పాలి రౌడీయిజం చేయాలి అన్నది బిజెపి సిద్ధాంతం అని మండిపడ్డారు. ఏం చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బుధవారం రోజున కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తూ...“అసలు బీజేపీ వాళ్లకు రాష్ట్రంలో ఏం పని ?  'రామ్ రామ్ జాప్న.. పరాయి లీడర్ ఆప్నా' అనేదే బిజెపి పని. ఆ పార్టీకి ఒక నాయకుడు లేడు. ఒక సిద్ధాంతం లేదు. వాళ్లు ప్రజలలో లేరు. వాళ్లలో పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి నాయకులు లేరు. పోటీ చేసినా వాళ్లు ఎన్నికల్లో గెలువరి భావించి కాంగ్రెసు, టిఆర్ఎస్ వంటి పార్టీల్లో పెద్ద లీడర్లపై కేసులు పెట్టి, ఐటీ దాడులు చేయించి ప్రలోభావాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపిలో చేరకపోతే ఈడీ,ఐటీ సంస్థలను ఉసిగొల్పుతున్నారు. దేన్ని ఉసిగొలిపిన తెలంగాణ ప్రజలు భయపడే వాళ్ళు కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎవరినీ వదిలిపెట్టకుండా మన దగ్గర గత నెల రోజులుగా ఐటి దాడులను చేస్తున్నారు. అయినా ఏం భయం లేదు. చట్టబద్ధంగా వ్యాపారాలు చేస్తున్నారు.అధికారులు వివరాలు అడిగితే ఇస్తాం,పత్రాలు ఇస్తాం చూసుకోండి అంతేగాని దాంట్లో భయపెట్టేదేముంది ? ప్రచారం చేసుకోవడానికి ఏముంది? ఎందుకోసం ఇట్ల చేస్తున్నారు ?” అని నిలదీశారు.

మన ఎమ్మెల్యేలను కొలుగోలు చేయడానికి వచ్చిన వాళ్లు బీజేపీ జాతీయ అగ్రనేత బీఎల్ సంతోష్ పేరు ప్రస్తావించారని, ఆయనను విచారణకు రమ్మని సిట్ అధికారులు పిలుస్తే రావడం లేదని తెలిపారు. ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. “మన దగ్గర దొరికిన దొంగలను విచారణ చేయవద్దట. యాదగిరిగుట్టలో బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారు. నిన్న ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడో నాకు అర్థం కాలేదు. దొరికిన దొంగను అరెస్టు చేయకుండా కోర్టుకు వెళ్తే విచారణకు రావాల్సిందేనని బిఎల్ సంతోష్ కి కోర్టు ఆదేశించింది. అయినా కూడా ఆయన విచారణకు హాజరుకావడం లేదు. మన మంత్రులు ఐటి,ఈడి, సిబిఐ వాళ్లు పిలిస్తే వెళ్తున్నారని కానీ బిఎల్ సంతోష్ ఎందుకు రావడం లేదు అన్నది ప్రజలు ఆలోచించాలి” అని కవిత కోరారు.

వాట్సాప్ లో బిజెపి తప్పుడు ప్రచారం 

దొంగ యూనివర్సిటీ అయిన వాట్సాప్ యూనివర్సిటీ లో బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. కానీ ఆ 2000 మొత్తం మోడీ ఇస్తున్నట్లు ఆ వాట్సాప్ లో బిజెపి ప్రచారం చేస్తున్నదని, అటువంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి నా మోడీ పీఎం కిసాన్ యోజన అనే పథకం పెట్టారని, పథకం పెట్టిన నాడు 13 కోట్ల మంది రైతుల కు ఇస్తున్నామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అది మూడు కోట్లకు తగ్గించారని, పథకం నుంచి 10 కోట్ల మంది రైతులను తప్పించారని వివరించారు. ఈ విషయాలన్నిటిని, బిజెపి తప్పులను ఎండగట్టాలని అన్నారు.


రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా తెలంగాణకు ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదని, తెలంగాణకు ఏం చేస్తారో కూడా చెప్పలేదని అన్నారు. దక్షిణ తెలంగాణలో మునుగోడు లో ఉప ఎన్నిక జరుగుతుంటే ఆయన ఉత్తర తెలంగాణ మీదుగా నడుచుకుంటూ వెళ్లిపోయాడని విమర్శించారు. కాంగ్రెస్ నేతలవన్నీ ఉత్తర కుమార మాటలేనని, కాబట్టి కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ఎప్పటికీ గులాబీ కండువాకు కంచుకోటగా ఉంటుందని తెలిపారు.

గిరిజనులకు లాభం

తెలంగాణ యువకులకే 95% ఉద్యోగాలు కల్పించడానికి వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించాలని కేంద్రానికి ప్రతిపాదించామని, ఆ తర్వాత రాజకీయ చరిత్ర వల్ల అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. దాంతో 96 వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. కెసిఆర్ ఏ పని కూడా మీద ఉట్టి ఉట్టిగా చేయరని, పకడ్బందీగా చేస్తారని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని 100 సంవత్సరాలుగా గిరిజనులు పోరాటం చేస్తున్నారని, కానీ అప్పటి ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదని గిరిజనులకు గౌరవం కూడా ఇవ్వలేదని కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడమే కాకుండా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని, అందుకోసం జిల్లాకు రూ. 10 లక్షల చొప్పున అందిస్తోందని వివరించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుని మోదీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం పెంచకున్నా సరే సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అన్నారు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ 10 శాతం రిజర్వేషన్ తోని గిరిజనులకు కలిగే లాభం గురించి తండాల్లోకి వెళ్లి ప్రజలకు వివరించాలని  కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం

చంద్రబాబు బలమైన నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ బయటకువచ్చి తెలంగాణ కోసం నడుంబిగించారని, రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగుపడుతాయని కేసీఆర్ విశ్వసించారని గుర్తు చేశారు. 2001లో పార్టీ పెట్టిన కొద్ది నెలలకే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని, అత్యంత రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతం మొత్తం 19 జడ్పిటిసిలను గెలిపించి జెడ్పి చైర్మన్ ఆనాడు కనీసం చేసుకొని టిఆర్ఎస్ పార్టీ రాజకీయానికి పునాది వేసిందని వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ వెంట నిలబడ్డారని తెలిపారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే వెనక్కి తగ్గలేదు వెనక్కి తగ్గలేదు కాబట్టి ఇవాళ రాష్ట్రం వచ్చిందని, ఆ తర్వాత రెండు సార్లు ప్రజలు దీవించి అధికారమిచ్చారని, దాంతో అనేక కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆ రకంగానే ఆలోచించారని ప్రాజెక్టులను అభివృద్ధి చేశారని కానీ రాజకీయాలను మాత్రం ఆలోచించలేదని తెలిపారు. ఈ ప్రతి మెట్టులో గులాబీ కార్యకర్తల పాత్ర కీలకమైనదని రాష్ట్రంలో దాదాపు 13వేల గ్రామపంచాయతీలు ఉంటే అందులో 95% సర్పంచులు ఎంపీటీసీలుగా టీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారని తెలిపారు. ప్రజలతోని నిలబడి పనిచేస్తే ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని రుజువైందని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 50వేల మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఇంటికెళ్లి టిఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తే సురేందర్ మల్లొకసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పారు. సీఎం కెసిఆర్ ఆలోచన, మనస్సు, మేధస్సు ఎప్పుడు తెలంగాణ ప్రజలతోనే నిండి ఉంటుందని, గ్రామంలో ఉన్నటువంటి బూత్ కమిటీలు అన్నిటిని క్రియాశీలకం చేసుకోవాలని గ్రామ శాఖ అధ్యక్షులకు తెలిపారు. సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ పనులను మర్చిపోకూడదని ప్రభుత్వ ప్రభుత్వ పనులు చేయాలని అదే సమయంలో పార్టీ పనులు కూడా చేయాలని పార్టీ ఉంటేనే పదవులు వస్తాయన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. కార్యక్రమం ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలలో కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని ప్రజా ప్రతినిధులు పని చేయాలని తెలిపారు. కార్యకర్తలకు ఏ చిన్న ఆపద వచ్చిన పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి కెసిఆర్ కిట్టు ఉచిత విద్యుత్తు రైతు బీమా వంటి పథకాల ద్వారా లబ్ది జరిగిందని తెలిపారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా మనం ఎందుకు ఆగం కావాలని ప్రశ్నించారు.


Tags : ed rides in telangana over delhi liquor scam,mlc kavitha party change comments,mlc kavitha party change,mlc kavitha,delhi liquor scam effect ed notice to mlc kavitha,ed notice to mlc kavitha,kavitha liquor scam,kcr liquor scam,kavitha in delhi liquor scam,delhi liquor scam,liquor scam kavitha,kavitha name in delhi liquor scam,cm kcr,cm kcr live,kalvakuntla kavitha,revanth reddy,etala rajender,bandi sanjay,trs vs bjp,cm kcr vs pm modi,yoyotv,tv9

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !