– అభివృద్ధే మా అజెండా
– హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు
– ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు!
– కరోనా కష్టకాలంలోనూ సంస్కరణలు చేపట్టాం..
– ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం..!
– రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ప్రధాని
మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విశాఖ పర్యటన ముగిసిన అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్‌కు వచ్చారు. ప్రధానికి గవర్నర్ తమిళి సై, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట సభలో మోదీ మాట్లాడుతూ..చిన్న కార్యకర్త స్థాయి నుండి ప్రధానిగా ఎదిగాను. తెలంగాణ బీజేపీ శ్రేణుల పోరాటం నాలో స్ఫూర్తిని నింపుతుంది. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ కమలం వికసిస్తుంది. మునుగోడు ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం మునుగోడుకు వచ్చింది. బీజేపీ పోరాటం వల్లే అది సాధ్యమైంది అన్నారు. తెలంగాణాలో ప్రతి ఉపఎన్నిక బీజేపీ బలోపేతాన్ని నిరూపిస్తుంది. తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
అయితే బేగంపేటలో ప్రధాని ప్రసంగం వాడివేడిగా సాగిందనే చెప్పుకోవాలి. పరోక్షంగా కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించిన మోడీ రాబోయే ఎన్నికల్లో తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పేరు, టీఆర్‌ఎస్ పేరు ప్రస్తావించకుండానే ఏకిపారేశారు. కుటుంబ పాలన గురించి ఆయన గుప్పించిన విమర్శలు పరోక్షంగానే చేసిన ఎవరికీ తాకాలో వారికే తాకాయనే చెప్పుకోవాలి.అయితే రామగుండంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది. సింగరేణి ప్రైవేటీకరణ, ఎరువుల ఉత్పత్తి, రైతుల సంక్షేమం అంశాలపై ప్రధాని మాట్లాడారు. అంతకుముందు ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎరువుల ఫ్యాక్టరీని అరగంటపాటు ప్రధాని సందర్శించారు. మొదటగా ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే 3 జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రైతులకు కల్పతరువుగా కిసాన్ యూరియా..
ఆర్‌ఎఫ్‌సీఎల్ కిసాన్ పేరిట ఉత్పత్తి చేస్తున్న యూరియా.. తెలంగాణ రైతులకు కల్పతరువుగా మారింది. రెండు దశాబ్దాల క్రితం మూతపడిన ఎఫ్‌సీఐని ఆర్‌ఎఫ్‌సీఎల్ పేరిట పునరుద్ధరించడంతో ఈ అవకాశం కలిగింది. రూ.6,338 కోట్ల వ్యయంతో రోజుకు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో వెయ్యి ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. దీనికి 2015 ఫిబ్రవరి 17న శ్రీకారం చుట్టగా, 2016 ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పనులకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 28న ట్రయల్ రన్ చేశారు. వాణిజ్యపరమైన ఉత్పత్తిని 2021 మార్చి 22న ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4,97,512 టన్నులు, ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు 5.2 లక్షలు, మొత్తం 10,17,512 టన్నుల యూరియాను ఉత్పత్తి చేశారు. అయితే, సెప్టెంబరు నెలాఖరు నుంచి పరిశ్రమను మరమ్మతుల పేరిట 20రోజులు షట్ డౌన్ చేశారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత మూడు రోజుల క్రితం తిరిగి యూరియా ఉత్పత్తిని ప్రారంభించారు.