సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సూపర్‌స్టార్‌ను చివరిసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కడసారి వీడ్కోలు పలికారు. కృష్ణకు కుమారుడు మహేష్ బాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్ మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణల శకం ముగిసింది.
సూపర్‌స్టార్ కృష్ణ ఇకలేరన్న వార్త తెలిసి ఆయన అభిమానులతోపాటు సినీరంగ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. పార్థివ దేహాన్ని సందర్శించేందుకు సినీ ప్రముఖుల్లో కొందరు కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలివెళ్లగా.. మరికొందరు నానక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహానికి వచ్చారు. కృష్ణ మృతదేహాన్ని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 12:08 గంటలకు అంబులెన్స్‌లో నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు. అంబులెన్స్ లోపలికి వెళ్తున్న సమయంలో అభిమానులు ‘సూపర్‌స్టార్ కృష్ణ.. అమర్‌రహే’ అంటూ నినాదాలు చేశారు. కృష్ణ పార్థిక దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం పద్మాలయా స్టూడియోకి తరలించారు. అనంతరం 12 గంటల నుండి అంతిమయాత్ర మొదలైంది. 3 నుండి 4.30 గంటల మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.