- ఫామ్‌హౌస్ కేసులో సిట్ విచారణ వేగవంతం !
- ప్రతీకారంగా ఐటీ సోదాలు, ఈడీ కేసులు.
- చివరికి ఏ మలుపు తీసుకుంటుందో అని ఆసక్తి !
దిల్లీ లిక్కర్‌స్కామ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మేల్సీ కవిత చుట్టూ తిరిగాయి. ఆ తరువాత క్యాసినో వ్యవహరంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులే లక్ష్యంగా పావులు కదులుతున్నాయి. మరోవైపు కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగుల కమలాకర్ చెందిన గ్రానైట్ సంస్థల్లో తనీఖీలు జరిపారు. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డికి చెందిన అన్ని కార్యలయాలు, సంస్థల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి అసలు కారణం ‘‘ఫామ్‌హౌస్ ఫైల్స్’’ కేసులో ప్రతికార చర్యగానే భావిస్తున్నారు టీఆర్‌ఎస్ నేతలు.
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ తనిఖీలు !
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లి ఫాం మెడోస్ విల్లాలోని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి , అల్లుడు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం యాభై చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా మల్లారెడ్డి కూతురు, కొడుకు, అల్లుడు నివాసాలతోపాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ చెల్లింపులకి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఐటీ సోదాల్లో భాగంగా దూలపల్లిలోని మల్లారెడ్డి కళాశాలలో ఐటీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. మెషీన్‌ల ద్వారా నగదును లెక్కిస్తున్నారు.
ఈడీ దూకుడు !
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ క్యాసినో, గ్రానైట్ కేసుల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. విచారణలు, నోటీసులతో అధికారులు తలమునకలై ఉన్నారు. క్యాసినో కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ ఈడీ విచారణకు హాజరయ్యాడు. బ్యాంక్ స్టేట్ మెంట్లను అధికారులకు సమర్పించాడు. గత వారం ఈ కేసుకు సంబంధించి తలసాని సోదరులు ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ క్రమంలోనే తలసాని పీఏ కూడా విచారణకు హాజరయ్యాడు. ఈ కేసులో విదేశాల్లో క్యాసినో ఆడారనే అభియోగాలు, హవాలా డబ్బు, ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్ కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణ అంతా టీఆర్‌ఎస్ నేతలు వారి అనుచరుల చుట్టే తిరగడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే కేసుకు సంబంధించి ఎల్ రమణను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. కానీ, విచారణ మధ్యలో ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.
సిట్ విచారణ వేగవతం !
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన రామచంద్రభారతి, నందకుమార్, సింహాయాజిలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేయటం, దర్యాప్తును వేగంగా కొనసాగించటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనంతరం ముగ్గురు నిందితులకు దగ్గర పరిచయాలు వారి వెనుక ఉండి నడిపించిన వారి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది సిట్. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్ కు నోటీసులు పంపగా.. తెలంగాణలో న్యాయవాది శ్రీనివాస్‌కు ఢల్లీిలో ఉండే బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌కు కూడా పంపారు. అయితే.. సిట్ నోటీసులపై బీజేపీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని ఇరికించేందుకు సిట్ నోటీసులిచ్చి వేధిస్తోందని పేర్కొంటూ.. వీటిపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపింది న్యాయస్థానం. సిట్ నోటీసులు రద్దు చేయాలన్న బీజేపీ విజ్ఞప్తిని నిరాకరించింది. కాకపోతే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సంతోష్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి న్యాయవాది శ్రీనివాస్ సహా బీజేపీ లీడర్ బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిలకు నోటీసులు పంపారు అధికారులు. 21న విచారణకు రావాలని ఆదేశించారు. కానీ, శ్రీనివాస్ ఒక్కరే హాజరయ్యారు. మిగిలిన ముగ్గురు సంతోష్, తుషార్, జగ్గుస్వామి విచారణకు రానందున లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఇక శ్రీనివాస్ మరోసారి సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన ఫోన్ కాల్ డేటాతోపాటు బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించారు అధికారులు. వాటిపై పలు సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. మరోవైపు రామచంద్ర భారతితో సంబంధం ఉన్నవారిపై ఫోకస్ పెట్టింది సిట్. గత రెండేళ్లుగా ఎక్కడికి వెళ్లారు? ఎవర్ని కలిశారు? అనే విషయాలపై ఆరా తీస్తోంది. ఆయన ఫోన్‌లో ఫోటోలు రికవరీ చేసినట్లు సమాచారం. మహారాష్ట్ర, కర్నాటకలో కొందరు కేంద్రమంత్రులను రామచంద్ర భారతి కలిసినట్టుగా అధికారులు గుర్తించారు.
ఎవరిది పై చేయి
ఫామ్‌హౌస్‌లో ఏమ్మేల్యేల కొనుగోళ్ళ వ్యవహారానికి సంబంధించి బీఎల్ సంతోష్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య నాయకుల పాత్రను బయటపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ఈడీ, సిబిఐ, ఐటీ దాడులతో టీఆర్‌ఎస్ నేతలు చేసిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ. ఈ రెండు అధికార కేంద్రాలు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో ఎవరిది పై చేయి కానుందో కాలమే నిర్ణయించాలి.
Tags:-task force police raids,police raids,raids in delhi and telangan,police raids on farmhouses in hyderabad,police raided,it raids on congress leader,trs leaders,cbi raids,it and ed raids on congress leader revanth reddy hous,top news,ed raids in hyderabad,ycp & tdp leaders,ed raids today,bjp leader,it raids,acb raids,ed raids at sanjay raut residence,ed & it raids,ed raids at sanjay raut home,manish sisodia over cbi raids,top news today