ఢల్లీి లిక్కర్ స్కాంలో ఈడీ ఇటీవలే కవిత పేరును ప్రస్తావించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఆమె పేరును చేర్చింది. లిక్కర్ స్కాం కేసులో మొత్తం 36 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ఎనిమిది మంది తెలుగు వాళ్లు ఉన్నారు. వంద కోట్ల రూపాయలు అంటూ.. కవితతో పాటు పలువురి పేర్లను పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుండగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢల్లీి లేదా హైదరాబాద్‌లో ఎక్కడైనా విచారణకు హాజరుకావొచ్చని వాటిలో పేర్కొంది. ఈనెల 6న రావొచ్చని తెలిపింది సీబీఐ. సీఆర్పీసీ 160 కింద సీబీఐ ఈ నోటీసులు ఇచ్చింది.
విచారణకు సిద్ధం అన్న కవిత !
సీబీఐ ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను విచారణకు సిద్ధం అని అయితే హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే సిబిఐకి వివరణ ఇస్తా అని తెలిపారు. డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు అవుతానని ఆమె తెలిపారు. ఇక ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కవిత ఇంటికి చేరుకుంటున్నారు.
కేసీఆర్‌తో కవిత భేటీ !
కాగా ఈరోజు కవిత ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఢల్లీి లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచిన ఈ క్రమంలో కేసీఆర్‌తో కవిత భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఈడీ, సీబీఐ కేసులపై కేసీఆర్‌తో ఆమె చర్చించనున్నట్టు తెలుస్తుంది. సీబీఐ విచారణకు హాజరైన క్రమంలో ఎలా స్పందించాలో చర్చించే అవకాశం ఉంది.
CRPC 160 నోటీసులు అంటే ఏమిటి?
కాగా CRPC 160 నోటీసులు ఇచ్చారంటే ఆ కేసుకు సంబంధించి వారిని సాక్షులుగా పరిగణిస్తారు. కానీ నిందితులుగా పరిగణించడం కానీ అరెస్ట్ చేయడం కానీ కుదరదు. అయితే కేసుకు సంబంధించిన విచారణకు మాత్రం హాజరు కావాల్సి వుంటుంది. ఆ విచారణలో వెల్లడయ్యే విషయాల ఆధారంగా తదుపరి చర్యలు వుండనున్నాయి.