కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ విధానం - సజ్జల

0

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పిటిషన్‌ ఆధారంగా తిరిగి రెండు రాష్ట్రాలు కలిపి ఉంచాలనే పరిస్ధితి సుప్రీంకోర్టులో వస్తే దాన్ని వైసీపీ స్వాగతిస్తుందన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలి.. లేదా సరిదిద్దాలని కోరతామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తీరు, సుప్రీంకోర్టులో కేసుపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చేసిన విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం జగన్‌పై కావాలనే ఆయన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు సజ్జల. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్నీ మేం వదులుకోబోమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అని వ్యాఖ్యానించారు సజ్జల. 

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని, కావాలనే సీఎం జగన్‌పై ఆయన కామెంట్స్‌ చేశారని ఫైర్‌ అయ్యారు రామకృష్ణా రెడ్డి. విభజన జరిగిన తీరుపైనే కేసు వేశారని, హామీల అమలు కోసం కాదని.. విభజన హామీల అమలు కోసం ఏపీ ప్రభుత్వం పోరాడుతోందని సజ్జల స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు కలిసే అవకాశాన్నీ ఏపీ సర్కార్‌ ఉపయోగించుకుంటుందని, ఇరు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సిందేముందన్నారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని విమర్శించారు. రెండు రాష్ట్రాలు కలిసేదాని కోసం వైసీపీ పోరాడుతోందని మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా.. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. ఏపీ సీఎం జగన్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందంటూ ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ అఫడవిట్‌ వేశారంటూ ఫైర్‌ అయ్యారు ఉండవల్లి. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడటానికి జగన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పోరాటం చేసే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఏపీ కోసం పోరాటం చేయకపోతే జగన్‌ రాజకీయ జీవితం ఇంతటితో ముగిసినట్లేనని అన్నారు.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !