ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధాని కాబోతోందని త్వరలోనే పూర్తిస్థాయి పాలన వ్యవహారాలతో పాటు తాను కూడా విశాఖకు నివాసం మారుతున్నట్లు చెప్పారు. దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నా. విశాఖపట్నం రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అవసరమైతే ప్రైవేటు భవనాలను కూడా లీజుకు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.