నెల్లూరు జిల్లా వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి రక్షణ సిబ్బందిని తగ్గించారని, ఆయన ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని తెలిపారు. శాసనసభ్యులే ప్రాణహానితో భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ మేరకు గురువారం ట్విటర్‌లో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర హోంశాఖకు తెలియజేస్తాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణభయంతో ఉన్నారు. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. సీఎం జగన్ ఆయన కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోం మంత్రి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రాణ హాని ఉందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని, భద్రత తగ్గించారని, తన కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు చేస్తున్నారని ఇటీవల ఆనం రాంనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.