కళాతపస్వి...వెండితెర యశస్వి...కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది.
సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు సినీకళామతల్లికి అందించారు. సినిమా కమర్షియల్ హంగులు దిద్దుకుంటున్న రోజుల్లోనూ సంగీత ప్రాధన్యత, స్ఫూర్తినింపే చిత్రాలతో అలరించారు. ఎందరో అగ్రకథానాయకుల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించి... ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీ రంగంలో ఆయన కృషికి 2016లో చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ఇక విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్ (59వ)చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్ చలన చిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.
కె.విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) February 3, 2023