తల్లిలాంటి శిక్షణ...తండ్రి లాంటి రక్షణ అని ఊదరకొట్టే శ్రీచైతన్య కాలేజీలో ఘోరం చోటుచేసుకుంది. షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ రాత్రి పదిన్నర గంటల సమయంలో తరగతి గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాత్విక్ సరిగా చదవడం లేదని వైస్ ప్రిన్సిపల్ క్లాసులోనే కడుపులో, చెంపపై ఇష్టానుసారంగా కొట్టడంతోనే రక్తం కక్కుకున్నాడని సమాచారం. అనంతరం గదిలో వేసి లాక్ చేశారని.. ఈ అవమానంతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. విద్యార్థికి రక్తం వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. విద్యార్థులు తీసిన వీడియోలో ఆ రక్తాన్ని విద్యార్థుల చేతనే తుడిపించడం షాకింగ్‌గా ఉంది. అందరి ముందే రక్తం వచ్చేలా కొట్టడంతో ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక ఒత్తిడితో సాత్విక్ తన తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇక ప్రాణపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో సాత్విక్‌ను క్రిందకు దించిన విద్యార్థులు రోడ్డుపై వెళుతున్న బైకర్‌ను లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తరలించడం గమనార్హం. కాగా అప్పటికే సాత్విక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో వైపు కనీసం విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పి..వాళ్లు వచ్చేంత వరకు కూడా ఆగకుండా.. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం.
చదువు కోసం పంపిస్తే చంపేస్తారా...
అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాత్విక్‌ను లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజుల పాటు ఆస్పత్రి పాలయ్యాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ సమయంలోనే అతన్ని ఏం అనొద్దని యాజమాన్యానికి బతిమిలాడుకున్నామని, అయినా కాని యాజమాన్యం వినలేదన్నారు. తమ కొడుకు మృతికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. కాగా ఆత్మహత్య వెలుగు చూడగానే వార్డెన్ నరేష్ గోడ దూకి పారిపోయాడు. మరి ఈ సంఘటనపై శ్రీచైతన్య యాజమాన్యం ఎలా స్పందిస్తుందనేది చూడాలి. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. యాజమాన్యంపై ఫిర్యాదులు చేసిన విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. మరో వైపు సాత్విక్ తల్లిదండ్రులు నార్సింగ్ పోలీసు స్టేషన్లో వార్డెన్ నరేష్‌తో పాటు కృష్ణా రెడ్డిలపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సబితా ఇంద్రారెడ్డి స్పందన !
తాజాగా ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణకు ఆదేశించారు సబిత. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు కూడా సబిత ఆదేశించారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కాలేజీ యాజమాన్యాలు సరైన చర్యలు ప్రారంభించాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్‌తో పాటు మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.