భారతీయ సినీ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన క్షణం.. భారతీయ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాకారం చేసింది. రెండు కొదమసింహాలు వీరోచితంగా పోరాడుతున్నట్లు, పొట్లగిత్తలు అందంగా కలబడుతున్నట్టు రామ్‌చరణ్, ఎన్టీఆర్ తమ స్టెప్స్‌తో ఇరగదీయగా ప్రపంచమే కళ్ళప్పగించింది చూసింది. భారతీయ సినిమా నుండి ‘నాటు నాటు...’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు ఆస్కార్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ప్రకటించగానే డాల్బీ థియేటర్ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్ అవార్డును అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది. అంతకుముందు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ ప్రదర్శనతో డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది.
చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు’
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబ్టటింది. అంతేకాదు, గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాపై.. హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ఎంతో మెచ్చుకున్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా ‘నాటు నాటు...’ పాట ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ ఉత్సాహంతోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ వివిధ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులకు పోటీ పడగా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు...’కు ఆస్కార్ నామినేషన్స్ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. స్వరమణి కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట విడుదలైన నాటి నుంచే అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుని ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమకు ఆస్కార్ అవార్డును అందించింది. అంతేకాదు, ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చరిత్ర సృష్టించింది.
❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 #NaatuNaatu #RRRMovie #Oscars95 pic.twitter.com/yIDgYJlTXH
— RRR Movie (@RRRMovie) March 13, 2023