- పార్టీలు ప్రోత్సహిస్తోంది శ్రీమంతులనే ?
- కార్యకర్తలు ఎప్పటికీ ఓటు బ్యాంకుగా మిగిలిపోవాల్సిందేనా ?
- సామాన్యులకు రాజ్యాధికారం అందని ద్రాక్షేనా ?
ధనం మూలం ఇదమ్ జగత్ ! ఈ నానుడి నేటి రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. ప్రజాస్వామ్యంలో ధనస్వామ్య ప్రభావం అధికమై సామాన్యులకు రాజ్యాధికారం అందని దాక్షలా మారుతోంది. పార్టీని నమ్ముకుని, పార్టీ కోసం జీవితాలను పణంగా పెట్టి, పార్టీని బ్రతికిస్తున్న కార్యకర్తల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. రాజకీయాలపట్ల అవగాహన ఉన్నా, ప్రజలకు సేవ చేయలనే దృక్పథం ఉన్న ఎంతో మంది కార్యకర్తలు గ్రామ, మండల స్థాయిలోనే ఎదగలేక ఆగిపోవటం నేడు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. మాట్లాడటం రాకపోయినా, రాజకీయాల పట్ల అవగాహన లేకపోయినా డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేయగలిగే ఆర్థిక స్థోమత ఉంటే చాలు రాత్రికి రాత్రే నాయకులుగా చెలామణి అవుతున్నారు. పార్టీనే నమ్ముకున్న కార్యకర్తల అవకాశాలను దూరం చేస్తున్నారు. పార్టీలు సైతం రాజకీయాలు అంటే సేవ అనే అర్థాన్ని ఎప్పుడో మార్చేశాయి. రాజకీయాలను పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చేశాయి. కార్యకర్తలను కేవలం ఓటుబ్యాంకుగా భావిస్తున్నాయి తప్ప, అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించటం ఎప్పుడో మానేశాయి. ఇప్పుడు ఉన్న యం.పి.లు, ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీలలో ఎంత మంది సామాన్య కార్యకర్తలు ఉన్నారో లెక్కలు తీస్తే చేతి వేళ్ళు కూడా ముందుకు కదలవు అంటే అతిశయోక్తి కాదు.
ఆర్థికంగా బలవంతుల్నే బరిలో దించుతున్న పార్టీలు !
ఆర్థికంగా ఎంత బలవంతుడైతే పోటీకి మార్గం అంత సులభం అవుతుంది. దీనికి ఈ పార్టీ, ఆ పార్టీ అని మినహాయింపు లేదు. అని ఒక్క తాను ముక్కలే. ఎన్నికలకు ఎడాదికి ముందుగానే అభ్యర్థి రంగంలోకి దిగుతున్నాడు. ప్రజలకు ఆకట్టుకోవడానికి వారు చేసే రకరకాల విన్యాసాలు చూస్తే పాపం అనిపించక మానదు. పార్టీ అధినేత దృష్టిలో పడడానికి, ప్రజల్లో తమ పేరు మారుమోగుతుందని చెప్పుకోవడానికి వారు నానా అవస్థలు పడుతున్నారు. వారి శక్తి మేరకు ట్రస్ట్‌లు, ఫౌండేషన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్నట్టు బిల్డప్‌లు కొడుతున్నారు. రోజు ఎదో ఒక కార్యక్రమం నిర్వహించటం, ఫోటోలకు పోజులు ఇవ్వటం, పేపర్‌లో న్యూస్ వచ్చేలా చూసుకోవటం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి టీవీల్లో కనిపించటం ఇదీ వారి రోజు వారీ జీవితం. నియోజకర్గంలో క్రికెట్ టోర్నమెంట్‌లు, ఎడ్లపందాలు, మెడికల్ క్యాంప్‌లు, ఉద్యోగమేళాలు, రోగులకు పండ్లు పంచటం, గుళ్ళు గోపురాలకు చందాలు ఇవ్వటం, చావైనా, వేడుకైనా ప్రతి చోట ఆ నాయకులే దర్శనం ఇస్తుంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చివరికి అధినాయకుడు మెచ్చి, ప్రజలు ఈ నాయకుడిని కోరుకుంటున్నాడు అని బలవంతంగా నియోజకవర్గంలో పోటీకి నిలబెడుతున్నారు. అధినాయకుడి మాట కాదనలేక కార్యకర్తలు తమ భుజంపై మోస్తున్నారు. గెలిచిన తర్వాత ఆ నాయకుడు తమ కార్యకర్తలకు ఏ మాత్రం న్యాయం చేస్తున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం. ఎంతో మంది నిజమైన కార్యకర్తలు పార్టీకి దూరంగా జరుగుతున్నారు. ప్రత్యర్థి పార్టీలో చేరలేక తటస్థులుగా మారిపోతున్నారు.
రాజకీయ గోపీల వలనే...
ఏ పార్టీ అధికారంలో ఉంటే వెంటనే ఆ పార్టీలోకి వెంటనే దూకే గోడమీద పిల్లులాంటి ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకుల వలనే అసలైన కార్యకర్తలకు అన్యాయం జరగుతుందనే కాదనలేని వాస్తవం. ధనవంతులైన రాజకీయ నాయకుల ప్రక్కన చేరటం వారికి కావలసిన పనులు చేయించుకోవటం ఈ రాజకీయ గోపీల పని. అసలైన, నిజాయితీ గల కార్యకర్తలను ఆ నాయకుడిని కలిసే అవకాశం లేకుండా పెత్తనం చెలాయించటం వలనే అసలైన కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఎన్నికల సమయానికి, నేడు ఉన్న పరిస్థితులు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నిజాయితీ గల కార్యకర్తలు చాలా మంది పార్టీకి దూరంగా జరిగి ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు అనేది వాస్తవం.
సామాన్య కార్యకర్తలకు రాజ్యాధికారం అందని ద్రాక్షేనా ?
ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. వారు సైనికుల్లా పనిచేస్తే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి తీరుతుంది అనేది కాదనలేని సత్యం. కానీ పార్టీలు కార్యకర్తలను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారు. అసలు పార్టీ అధినాయకుడికి, కార్యకర్తలకు మధ్య ఉన్నది ఎనలేని ప్రేమ, తరగని అభిమానం అనే బంధం మాత్రమే. కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోకుండా బలవంతంగా ధనవంతులైనా నాయకులను రుద్దుతూ, వారి గెలుపుకి కృషి చేసినా కార్యకర్తలకు నేడు మిగిలింది ఏమిటి అంటే లెక్కలేనన్ని కేసులు, కెరీర్ లేక ఇబ్బందులు, ఆర్థికంగా నష్టం తప్ప కార్యకర్తలకు ఒరిగిందేమి లేదు. ఈ సారి కూడా నిజమైన, నిఖార్సైన పార్టీ కార్యకర్తలకు తప్ప, వ్యాపారస్తులకి, ఎన్నైరై ధనవంతులకు టికెట్లు ఇస్తే కార్యకర్తలు పార్టీలకు సహకరించే పరిస్థితి లేదు అనే వాదన కార్యకర్తల నుండి వినపడుతోంది. ఎన్ని రోజలు జెండా మోయాలి. మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి అని తిరుగుబాటు బావుటా ఎగురవేసే పరిస్థితులు పల్లెల్లో కనిపిస్తున్నాయి. సామాన్య కార్యకర్తలను పట్టించుకోని ధనవంతులైన నాయకులు, వారి రోజు వారి వ్యాపార కార్యకలాపాలు తప్ప కార్యకర్తల అభివృద్ధికి ఏ మాత్రం సమయం కేటాయించటం లేదు. అందుకే చాలా వరకు గ్రామల్లోని కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరుగుతున్నారు. పార్టీ ఎక్కడైనా సభ, సమావేశం, నిరసన కార్యక్రమం నిర్వహించాలంటే డబ్బులు పంచి కూలీలను తీసుకువస్తున్న పరిస్థితి. ఇకనైనా పార్టీల తీరు మారక పోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించవలసి వస్తోందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.