కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను అధీనంలోకి తీసుకుని పేపర్‌ లీక్‌ !

0

 


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్‌ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిస్టమ్‌ ఎనలిస్ట్‌ రాజశేఖర్‌, కార్యదర్శి పీఏ ప్రవీణ్‌లు ఇరువురు అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది. ఇందుకోసం మొత్తం కంప్యూటర్‌ వ్యవస్థను తమ అధీనంలోకి తెచ్చుకొని అప్పటి నుంచే కాన్ఫిడెన్షియల్‌ సిస్టమ్‌లో యాక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది. ఆరు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. ఎవరూ పసిగట్టలేకపోవడం గమనార్హం. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజశేఖర్‌ ఎలాంటి సమాచారమైనా తస్కరించి ప్రవీణ్‌కు అందజేసేవాడు. అయితే, టౌన్‌ప్లానింగ్‌(టీపీబీవో) ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు ఫిర్యాదు రావడంతో రేణుక కోసమే తాను ప్రశ్నపత్రం తస్కరించానని ప్రవీణ్‌ చెప్పాడు. కానీ, అది అబద్ధమని తేలింది. లీకేజీ కేవలం ఆ పరీక్షకు మాత్రమే పరిమితమని నమ్మించేందుకే రేణుక ప్రస్తావన తెచ్చాడని.. వాస్తవానికి మిగతా ప్రశ్నపత్రాలనూ ప్రవీణ్‌, రాజశేఖర్‌ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సిట్‌ సిద్ధం చేసిన నివేదికలో  ఇలాంటి సంచలనాత్మక విషయాలెన్నో బయటపడుతున్నాయి. రాజశేఖర్‌, ప్రవీణ్‌లు కమిషన్‌ కార్యాలయంలో సాగించిన హవా చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న కమిషన్‌ కార్యాలయంలో లీకేజీలకు తావులేకుండా కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

అన్ని పరీక్షలపైనా కన్ను

ప్రవీణ్‌, రాజశేఖర్‌లు కమిషన్‌ నిర్వహించబోయే అన్ని పరీక్షలపైనా కన్నేసినట్లు తెలుస్తోంది. దాదాపు సంవత్సరం క్రితం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్‌ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేశారు.. ఈ క్రమంలో వ్యవస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అప్పటి నుంచే వారిద్దరూ ప్రణాళిక మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. కమిషన్‌లో ప్రత్యేకంగా కాన్ఫిడెన్షియల్‌ విభాగం ఉంది. ఇది సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పని చేస్తుంది. కార్యదర్శి, ఛైర్మన్‌లకు మాత్రం దీనిపై అజమాయిషీ ఉంటుంది. పరీక్షల కోసం సిద్ధం చేసే ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్‌ విభాగంలోని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ విషయం రాజశేఖర్‌కు తెలుసు. దాంతో కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ అప్‌గ్రేడేషన్‌ పేరుతో డైనమిక్‌ ఐపీని స్టాటిక్‌ ఐపీగా మార్చాడు. అంటే ఇంచుమించు కాన్ఫిడెన్షియల్‌ విభాగంలోని కంప్యూటర్‌ను తన కంప్యూటర్‌ ద్వారా నియంత్రించగలిగేలా చేశాడన్నమాట. ఈ క్రమంలోనే అక్టోబరులోనే గ్రూప్‌-1 పరీక్ష ప్రశ్నపత్రం తస్కరించాడు.

పెన్‌డ్రైవ్‌ అబద్ధం..

టౌన్‌ప్లానింగ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయిందని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో ప్రవీణ్‌ వ్యవహారం బయటపడిరది. తన స్నేహితురాలు రేణుక అభ్యర్థన మేరకు మిత్రుడు రాజశేఖర్‌తో కలిసి ఏఈ ప్రశ్నపత్రం తస్కరించి ఇచ్చానని చెప్పాడు. కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించి, దాని ద్వారా ఫిబ్రవరిలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఫోల్డర్‌ను నాలుగు పెన్‌డ్రైవ్‌లలో కాపీ చేసుకున్నట్లు రాజశేఖర్‌ చెప్పాడు. కానీ, అక్టోబరులోనే ప్రశ్నపత్రాలు తస్కరించినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబరు 16వ తేదీన గ్రూప్‌-1 పరీక్ష జరిగింది. స్వయంగా ఈ పరీక్ష రాసిన ప్రవీణ్‌కు మంచి మార్కులు వచ్చినట్లు తేలగానే అనుమానాలు ముసురుకున్నాయి. ఆ అనుమానంతోనే లోతుగా దర్యాప్తు చేశారు. ఇందులో అక్టోబరు నుంచే కమిషన్‌ కంప్యూటర్‌ వ్యవస్థను రాజశేఖర్‌, ప్రవీణ్‌లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు నిర్ధారణ అయింది. దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు పెన్‌డ్రైవ్‌ నాటకం ఆడారని తేలిపోయింది.

పెరగనున్న నిందితులు

అక్టోబరు నుంచి ఇప్పటి వరకూ కమిషన్‌ గ్రూప్‌-1, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌, సీడీపీఓ, సూర్‌వైజర్‌ గ్రేడ్‌-2, ఏఈఈ, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఏఈ.. ఇలా మొత్తం ఏడు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. అయితే, అక్టోబరు నుంచే ప్రవీణ్‌, రాజశేఖర్‌ల దందా నడుస్తోందన్న ఆధారాల నేపథ్యంలో మిగతా పరీక్షల ప్రశ్నపత్రాలూ బయటకు తెచ్చి ఉంటారనే అనుమానం కలుగుతోంది. దీన్ని నిర్ధారించుకునేందుకు సిట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌-1 పరీక్షలో 100 కంటే ఎక్కువ మార్కుల వచ్చిన వారందర్నీ పిలిచి విచారిస్తున్నట్లు విశ్వపనీయ సమాచారం. దాంతోపాటు ప్రవీణ్‌, రాజశేఖర్‌ల ఫోన్‌ డేటా ఆధారంగానూ దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తయిన మిగతా అన్ని పరీక్షల్లో పాల్గొని, మంచి మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులందరినీ విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రవీణ్‌, రాజశేఖర్‌ల నుంచి వారిలో ఎవరికైనా ఫోన్లు వెళ్లినట్లు నిర్ధారణ అయితే అలాంటి వారిని మరింత క్షుణ్ణంగా విచారించనున్నారు. ఇప్పటికే నాలుగు పరీక్షలు రద్దు చేశారు. అంటే అవన్నీ ముందుగానే లీక్‌ అయినట్లు కమిషన్‌ నిర్ధారించినట్లే. ఈ నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంకా ఎవరైనా పొంది ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలితే వారందర్నీ కేసులో నిందితులుగా చేర్చనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !