- బెయిల్‌పై విడుదలైన బండి సంజయ్ !
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ !
- టెన్త్‌పేపర్ లీకేజీ ఓ కట్టుకథ !
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం కేసీఆర్ కుటుంబం టెన్త్ పేపర్ లీకేజీ బాద్యులం మేమంటూ కుట్ర పూరితమైన ఆరోపణలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కరీంనగర్ జైలుకు వెళ్లిన సంజయ్.. బెయిల్ పై శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలువద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ కుట్రలకు కేసీఆర్ కుటుంబం పాల్పడుతుందని సంజయ్ ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే టీఎస్‌పీఎస్సీ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. మంత్రి కేటీఆర్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, నష్టపోయినటువంటి యువతకు రూ.1లక్ష భృతిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీలో ప్రమేయం ఉన్న కొడుకును కాపాడుకునేందుకు కేసీఆర్ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుండని సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రాష్ట్రంలో 30లక్షల మంది యువతను రోడ్డున పడేసిన మూరుడు మంత్రి కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెన్త్‌పేపర్ లీకేజీ ఓ కట్టుకథ
30 లక్షల మంది యువత భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే.. టెన్త్ పేపర్ లీకేజీ చేశామని చెప్పి కట్టుకథలు చెబుతున్నారని సంజయ్ విమర్శించారు. హిందీ పేపర్ లీక్ చేశామని చెబుతున్నారని, మరి ముందురోజు తెలుగు పేపర్ ఎలా లీకైందని సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు, పరీక్షా హాల్‌లోకి మొబైల్ ఎలా పోయిందని ప్రశ్నించారు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే, టీఎస్‌పీఎస్‌సీ, టెన్త్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, తద్వారా వాస్తవాలు బయటకు తేవాలని బండి సంజయ్ అన్నారు.లిక్కర్ వీరులు, లీకేజీ వీరులు కేసీఆర్ కుటుంబం అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీ విషయంలో ఉద్యమం ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. వరంగల్ గడ్డమీద టీఎస్పీఎస్సీ అభ్యర్ధులతో అతి త్వరలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. వరంగల్ సీపీపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సీపీ ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. మాల్ ప్రాక్టీస్ అంటే ఏంటో కూడా తెలియని సీపీ ఆయన అంటూ ఎద్దేవా చేశారు. మా అత్త చనిపోయిన సమయంలో ఇదా పరిస్థితి..? నన్ను కన్నకొడుకులా చూసింది. నేను లేకపోతే పక్షి ముట్టలేదు. ఇంట్లో అంతా విషాదంలో ఉన్నారు. ఓ పార్లమెంటేరియన్‌తో వ్యవహరించే శైలి ఇదా..? అంటూ పోలీసుల తీరుపై సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు.