ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా రంగులు మార్చుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అటువైపు గోడ దూకేందుకు నేటి రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించటం లేదు. నిసిగ్గుగా అవకాశవాద రాజకీయాలకు పాల్పతున్నారు. నమ్ముకున్న నాయకుడికి వెన్నుపోటు పొడుస్తున్నారు. అధికార పార్టీ నాయకుడి వెన్నంటే ఉండి వారికి తెలియకుండానే అవినీతికి పాల్పడుతూ, సెటిల్‌మెంట్లు చేస్తూ, షాడో ఎమ్మేల్యేలుగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకులు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఎమ్మేల్యే లేదా ఎమ్మేల్యే అభ్యర్థులకు ముఖ్యఅనుచరులుగా పాగా వేయటం, మండలంలో అంతా తన ఆధీనంలో ఉంది అన్న భ్రమలు కల్పించటం, వారి నుండి డబ్బు, పదవులతో దర్పం వెలగబెట్టడం, సొంత వ్యాపారాలు వృద్ధి చేసుకోవటం, తరువాత ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం లేదనే అంచనాతో మరో పార్టీలోకి జంప్ అయ్యే రాజకీయ గోపీలు ఎక్కవైపోయారు.
ద్వితీయ శ్రేణి నాయకులతోనే అంతా !
2019 ఎన్నికలనే తీసుకోండి. అప్పటిదాకా టిడీపీలో కాంట్రాక్టర్లుగా, నియోజకవర్గ పరిథిలో వివిధ స్థాయిల్లో ఉన్న పదవులు అనుభవించిన వారందరూ ఎన్నికలకు రెండు,మూడు నెలల ముందు వైసీపీలోకి క్యూ కట్టారు. కొంత మంది డబ్బుకి, మరికొంత మంది పదవులకు అమ్ముడుపోయారు. ఓ పద్ధతి ప్రకారం పార్టీని దెబ్బతీయటం వీరి పని. మండలంలో తాము ఏది చెబితే అదే వేదం. ఓట్లు గంపగుత్తగా పడతాయి అని నమ్మించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వారి బుట్టలో పడ్డ నాయకులకు మండల పరిధిలో జరిగే విషయాలు ఏమి తెలియనివ్వరు. నిజమైన కార్యకర్తల అవసరాలు ఉన్నా వారికి విధేయులగా ఉన్న వారికే పనులు చేపిస్తూ మిగిలిన కార్యకర్తలను కనీసం పట్టించుకోకపోవటం జరుగుతోంది. ఇలాంటి అవకాశవాదులను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్ళి వీరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాల్సిన బాధ్యత పార్టీ ముఖ్యనాయకులే తీసుకోవల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ, ఆ పార్టీ అనే బేధం చూపకుండా అందరినీ కలుపుకుపోతూ అందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ స్థాయిలోనూ నిజాయితీపరులైన నాయకులను గుర్తించి వారికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లులను ఎంత దూరం పెడితే పార్టీలు అంత బాగుంటాయి అనటంలో సందేహం లేదు.
టీడీపీ పంచకు చేరుతారా !
ఈ సారి మళ్ళీ అదే ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ తమ రాజకీయ ఉనికి కోసం మళ్ళీ టీడీపీలో చేరేందుకు ఒక్కొక్కరుగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత శాసనసభ్యుల మీద అవినీతి ఆరోపణలు చేయటం, అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రత్యర్థి పార్టీ నాయకుల అండ దొరుకుతుందని ఆశ. ఎలాగైనా టీడీపీలో చేరి తమ రాజకీయ పరపతిని పెంచుకోవాలి అనేది వారి లక్ష్యంగా తెలుస్తోంది. అయితే వీరి రాకతో గత 4 సంవత్సరాలుగా టీడీపీని అంటిపెట్టుకుని కేసులకు వెరవకుండా పార్టీనే నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు మళ్ళీ నిరాశే ఎదురవుతోంది. పార్టీలో గుర్తింపు లేకపోగా, వలస నాయకుల క్రింద పనిచేయలేక పార్టీకి దూరంగా జరగటం ప్రతీ పార్టీలో సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. నిజమైన కార్యకర్తలు కావాలో లేక ప్రక్కనే ఉండి భజన చేస్తూ వారి సొంత లాభం చూసుకునే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కావాలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులే ఆలోచించుకోవాలి. అవసరం కోసం, అవకాశం కోసం పార్టీలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేతలను చూసి మొదటి నుంచి పార్టీ విధేయతగా ఉంటున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వాళ్లను దగ్గరకు రానిస్తే కేసులు, లాఠీ దెబ్బలు , అవమానాలు ఎదుర్కొన్న తమ పరిస్థితి ఏంటని ఈ నాలుగు సంవత్సరాలు పార్టీని అంటిపెట్టుకున్న నేతలు ప్రశ్నిస్తున్నారు.
అవకాశవాదులను పక్కన పెట్టకపోతే పార్టీలకు తీరని నష్టమే !
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి స్వలాభం కోసం పాకులాడే అవకాశవాదులను పార్టీలు గుర్తించి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. పార్టీ కోసం గ్రామస్థాయిలో నిస్వార్థంగా నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలు గత కొంత కాలంగా గుర్తింపు కోరుకుంటున్నారు. నిజమైన కార్యకర్తలను గుర్తించటంలో అధినాయకులు ఫెయిల్ అవుతున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను నమ్ముకుని ఎన్నికల సమయానికి పూర్తిగా మునిగిపోతున్నారు. ఇకనైనా పార్టీ నాయకులు నిజమైన కార్యకర్తలను గుర్తించి వారిని కాపాడుకోవల్సిన అవరసం ఎంతైనా ఉంది.