ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నారు. చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌లపై తనదైనశైలిలో సెటైర్లు వేశారు. అవి సెల్ఫీ ఛాలెంజ్‌లు కాదని చంద్రబాబు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అని దుయ్యబట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై విమర్శలు చేశారు. ‘ప్రజల దగ్గరకు వాలంటీర్ వెళ్లి సంక్షేమం ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ప్రతి ఇంటికి ఎమ్మెల్యే, మంత్రులు వెళుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఒక సైనిక వ్యవస్థలాగా ఏపీ ప్రజలకు అండగా నిలుస్తోంది. అందుకే ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. ఇంట్లో ఎవరూ చూస్కోక పోయినా జగన్ ఉన్నాడనే నమ్మకంతో చాలామంది ఉన్నారు. మెగా పీపుల్స్ సర్వే ఒక అద్భుతమైన కార్యక్రమం. జగన్‌కు మద్దతిచ్చేందుకు అందరూ తమ వివరాలు ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక సంచలన కార్యక్రమం. పవన్ అయినా చంద్రబాబు అయినా ప్రజలకు ఏం చేశారో చెప్పి ఇంటికి స్టిక్కర్లు వేయాలి’మేమేం చేస్తున్నారో టీడీపీ, జనసేన నేతలు ప్రజల్ని అడిగి తెలుసుకోండి.
చంద్రబాబువి సెల్ఫీలు కాదు సెల్ఫ్ గోల్స్
చంద్రబాబు టిడ్కో ఇళ్ల దగ్గర తీసుకుంటున్నవి సెల్ఫీలు కాదు సెల్ఫ్ గోల్స్. చంద్రబాబు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. చంద్రబాబు ముసిలి నాయకుడు.. మూలన కూర్చోకుండా ఇంకా కుట్రలు పన్నుతున్నాడని ఫైర్ అయ్యారు. కుప్పంలో అయినా, నగరిలో అయినా నేను సిద్ధం.. నీ మ్యానిఫెస్టో నువ్వు తీసుకుని రా.. మా మ్యానిఫెస్టో నేను తీసుకుని వస్తాను.. నువ్వు చేసిన హామీల్లో ఎన్ని అమలు చేశావు నువ్వు చెప్పు.. మేం చేసిన అభివృద్ధి ఏంటో నేను చెబుతాను.. అప్పుడు ప్రజలు ఎవరితో సెల్ఫీ ఫోటో దిగుతారో చూద్దాం.. సెల్ఫీ ఛాలెంజ్ అంటే అది అని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. ప్రజలు మా ప్రభుత్వ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం.. జగన్‌ను ప్రజలు ఎలా అభిమానిస్తున్నారో మాకు వస్తున్న స్పందన చూస్తేనే అర్థం అవుతుందన్నారు. ప్రజల ఇంటికే వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళుతున్నారు.. మీకు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయని ప్రజలనే నేరుగా అడుగుతున్నారని వివరించారు.. ఏడు లక్షల మంది జగన్ సైనికులు క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్తున్నారు.. 63 లక్షల 93 వేల మంది ఇళ్లకు మా సైనికులు వెళ్లారని.. పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతున్నారని.. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక సంచలనంగా అభివర్ణించారు మంత్రి ఆర్కే రోజా.