మాస్ అనే పదానికి పేటెంట్‌లా మారారు...నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య ఈయన టైమింగ్ ఏమిటో గాని ఏది పట్టుకుంటే అది సూపర్ డూపర్ హిట్‌గా నిలుస్తోంది. గత రెండేళ్లలో బాలయ్య పూర్తిగా తన రూట్ మార్చేశారు. ఒకవైపు సినిమాలతో సూపర్‌హిట్ కొడుతుండగా, మరో వైపు అన్‌స్టాపబుల్స్ షోతోను సత్తా చాటాడు. చెప్పాలంటే బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరూ అవాక్కయ్యేలా చేశారు. తాజాగా ముగిసిన రెండో సీజన్ లోనూ సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇంకో వైపు కమర్షియల్ యాడ్స్‌లోనూ మెరుస్తూ అన్నింటా తానై నిలుస్తున్నాడు. ఇక్కడితే ఆగిపోలేదు. ఇప్పుడు ఏకంగా క్రికెట్ కామెంటేటర్ గా మారిపోయారు. ఆల్రెడీ ఉన్నవాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా తనదైన శైలి కామెంటరీతో అలరించారు.
కామెంటేటర్‌గా కొత్త ఇన్నింగ్స్
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్-2023 కోసం హీరో బాలకృష్ణ కామెంటేటర్‌గా మారారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అదే టైంలో బాలయ్య రేంజ్ పెరగడం చూసి తెగ ముచ్చటపడిపోయారు. అందుకు తగ్గట్లే చెన్నై-గుజరాత్ మ్యాచ్ సందర్భంగా తెలుగు కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న బాలయ్య.. అక్కడి సహచర కామెంటేటర్స్‌తో ఇట్టే కలిసిపోయారు. మ్యాచ్‌కు ముందు జరిగిన చర్చా కార్యక్రమంలో అలరించిన బాలయ్య.. కామెంటరీ దగ్గరకు వచ్చేసరికి తొలుత కాస్త తడబడ్డారు. కానీ కాసేపటికే తనదైన శైలితో ఆకట్టుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్ పదాలు కలగలిపి మాస్ పదాలతో కామెంటరీ చెబుతూ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నారు. కామెంటరీ సందర్భంగా మ్యాచ్, ఆటగాళ్ల గురించే కాదు మిగతా స్పోర్ట్స్, ఫిట్ నెస్ లాంటి అంశాల గురించి తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. క్రీడలు.. శారీరకంగానే కాదు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడతాయని అన్నారు.
ఇష్టమైన బౌలర్స్
షేన్ వార్న్, పాల్ ఆడమ్స్, అనిల్ కుంబ్లే తనకు ఇష్టమైన బౌలర్లని బాలయ్య చెప్పారు. చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. 170 స్కోరు చేస్తుందని అంచనా వేశారు. దాదాపు అలానే జరిగింది. చెన్నై 178 పరుగులు చేయగా, గుజరాత్ ఆ టార్గెట్ ని పూర్తి చేసి.. ఈ మ్యాచులో విజయం సాధించింది. కాలేజీ రోజుల్లోనూ క్రికెట్ ఆడేవాడినని గుర్తు చేసుకున్న బాలయ్య.. చాలామంది క్రికటర్లతో తనకు పరిచయముందని చెప్పారు. బాలయ్య కామెంటరీ చెబుతున్నప్పుడు.. ఫ్యాన్స్ అందరూ జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం విశేషం.