- విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు.
- పరీక్షలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే అరెస్ట్ !
పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. వికారాబాద్, కమలపూర్‌లో పేపర్ లీకేజ్‌లపై బండి సంజయ్ ప్రెస్ నోట్ ఇచ్చారని, పేపర్ లీకేజ్‌లకు ప్రభుత్వమే భాద్యతంటూ.. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామన్నారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
మాస్ కాపీయింగ్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్రకు సంబంధించి ఎక్కడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో మెన్షన్ చేయలేదు. కేవలం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నారని... అందుకే అరెస్టు చేసి.. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఇప్పటికే బీజేపీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. దీనిపై ఇంకా న్యాయస్థానం నిర్ణయం తీసుకోలేదు. కాగా బండి సంజయ్, ప్రశాంత్‌ల చాంటింగ్‌లపై పోలీసులు దృష్టి సారించారు. పేపర్ లీక్ కంటే ముందురోజు ప్రశాంత్‌తో బండి సంజయ్ చాటింగ్ చేశారని, సంజయ్‌తో ప్రశాంత్ 100కు పైగా కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న సంజయ్‌కు పేపర్ పంపాక కూడా ప్రశాంత్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. ప్రశాంత్ వాట్సాప్ చాట్‌ను అధికారులు రిట్రివ్ చేస్తున్నారు.
పేపర్ లీకేజీ సూత్రధారి బండి సంజయ్‌నే : మంత్రి హరీష్‌రావు
భాజపా కుట్ర రాజకీయాలు చేస్తోందని ప్రజలు గమనిస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీల వ్యవహారంలో సూత్రధారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయేనని ఆయన ఆరోపించారు. మెదక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. భాజపావి దిగజారుడు రాజకీయాలని.. అధికారం కోసం ఏదైనా చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని హరీశ్‌రావు విమర్శించారు. పిల్లల భవిష్యత్‌తో ఆటలాడతారా? అని మండిపడ్డారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని సవాల్ చేశారు. పట్టపగలు స్పష్టంగా దొరికిన దొంగ బండి సంజయ్ అని ఆయన ఆరోపించారు.
‘‘వాట్సప్‌లో ప్రశ్నపత్రం పెట్టిన నిందితుడు ప్రశాంత్ భాజపా కార్యకర్తా? కాదా? సంజయ్‌కు అతడు ప్రశ్నపత్రం పంపించింది నిజమా? కాదా? రోజుకో పేపర్ లీకేజీ పేరుతో భాజపా కుట్రలు పన్నిన మాట వాస్తవమా? కాదా? సంజయ్‌కు ప్రశ్నపత్రం పంపిన ప్రశాంత్.. 2 గంటల్లో 142 సార్లు ఫోన్‌లో మాట్లాడాడు. అందులో భాగంగా సంజయ్‌కు కూడా ఫోన్ చేశాడు. ఇది నిజమా? కాదా? ఈ ప్రశ్నలకు భాజపా నేతలు సూటిగా సమాధానం చెప్పాలి ’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ నిందితుల విడుదల కోసం భాజపా నేతలు ధర్నా చేశారని.. విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నేతలకు చదువు విలువ తెలియదని ఆక్షేపించారు. ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు భాజపాకు గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు కోరారు. బండి సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతున్నట్లు చెప్పారు.