- చంద్రబాబుకి తలనొప్పిగా మారిన సీనియర్లు !
- కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్లు డిమాండ్
తెలుగుదేశం పార్టీలో ఏమ్మేల్యే, యం.పి. టికెట్లుకు ఆశావాహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. వచ్చే ఎన్నికల్లో 40% టికెట్లు యువతకే కేటాయిస్తా అని ప్రకటించినప్పటి నుండి ఆశావాహుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఈసారి ఎలాగైనా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు అంత అషామాషీగా ఉండవని చెబుతున్నారు. అయితే ప్రతి జిల్లాలో సీనియర్లు చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యారు. ఒక టిక్కెట్‌తో వారు సరిపెట్టుకోవడం లేదు. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తమ అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. బలమైన ప్రత్యర్థి ఒక వైపు, పొత్తులతో సీట్ల పంపకాలు.. మిగిలిన సీట్లు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇటువంటి సమయంలో సీనియర్లు ఆయనకు దడ పుట్టిస్తున్నారు.
రాయపాటి అల్టిమేటమ్...
గుంటూరు సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు చంద్రబాబుకు తన మనసులో మాటను వెల్లడిరచారు. తన కుటుంబంలో మూడు టిక్కెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కుదరకుంటే రెండు టిక్కెట్లు అయినా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. తన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని.. తన కుటుంబానికి మాత్రం రెండూ కేటాయించాల్సిందేనంటూ కుండబద్ధలు కొడుతున్నారు. తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి కానీ.. పెదకూరపాడు కానీ ఏదో ఒక నియోజకవర్గం కేటాయించాలని కోరుతున్నారు. తమ్ముడు కూతురు శైలజకు ఒక టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా తనకు నరసారావుపేట ఎంపీ టికెట్ ఇస్తే పోటీకి సై అన్నారు. ఎంత డబ్బులు కావాలంటే అంత ఖర్చుపెడతానని కూడా చంద్రబాబుకు ఆఫరిస్తున్నారు. అయితే జిల్లా పరిధిలో తన అనుచరవర్గానికి సీటు కేటాయించాలని కోరుతున్నారు. తాటికొండ నియోజకవర్గానికి సంబంధించి తోకల రాజవర్థన రావు సీటు అడుగుతున్నారు. అయితే ఈ సారి డబ్బుతో పనిలేకుండానే టీడీపీ గెలుస్తుందని రాయపాటి అభిప్రాయపడుతున్నారు.
యనమల గట్టి పట్టు !
ఇదిలా ఉంటే నరసారావుపేట ఎంపీ సీటు కోసం మరో సీనియర్ నాయకుడు యనమల రామక్రిష్ణుడు గట్టి పట్టు పడుతున్నారు. ఆయన అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. కడప జిల్లాకు చెందిన మహాష్ టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. కానీ రాయలసీమ జిల్లాలో కాకుండా నరసారావుపేట నుంచి దింపితే సేఫ్ అని రామక్రిష్ణుడు భావిస్తున్నారు. అయితే మహేష్‌కి ఇవ్వవద్దంటూ రాయపాటి హెచ్చరికలు జారీచేస్తున్నారు. నాన్ లోకల్ పర్సన్‌కు టిక్కెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. స్థానికత అంశం తెరపైకి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇద్దరు సీనియర్ల మధ్య చంద్రబాబు నలిగిపోతున్నారు. పంచాయితీని ఎలా తేల్చుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.
ఉత్తరాంధ్ర పరిస్థితి అంతే !
ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్లు సైతం కుటుంబ టిక్కెట్ల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కళా వెంకటరావును ఈసారి ఎంపీ బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అశోక్ గజపతిరాజును విజయనగరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించి కళా వెంకటరావును ఎంపీ బరిలో దించాలని చూస్తున్నారు. కానీ కళా వెంకటరావు మాత్రం తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకు ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు కావాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే కళా వెంకటరావు సోదరుడు కుమారుడు కిమిడి నాగార్జున చీపురుపల్లిలో అభ్యర్థి. దీంతో కుటుంబానికి మూడు టిక్కెట్లు అవుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కళా వెంకట్రావ్ మాత్రం తన రాజకీయ ప్రత్యర్థి అయిన కింజరాపు కుటుంబంలో అచ్చెన్నాయుడుకు ఎమ్మెల్యే. ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడుకు ఎంపీ, కుమార్తె భవానీకి ఎమ్మెల్యే సీటు ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అటు విశాఖకు చెందిన అయ్యన్నపాత్రుడు సైతం తనకు నర్సీపట్నం అసెంబ్లీ, తన కుమారుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ సీటుకు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎవరికీ హామీ ఇవ్వడం లేదు. కానీ ఎన్నికల ముందు సీట్ల పంపకాలతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.