ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. టెన్త్ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది పరీక్ష రాశారు. ఏప్రిల్ 3 నుంచీ 18 వరకు పరీక్షలు జరిగాయి. ఇక ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://www.sakshieducation.com అందుబాటులో ఉంచారు. రికార్డు సమయంలో 18 రోజుల్లోనే పది ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి 26 వరకు స్పాట్ వ్యాల్యూయేషన్ పూర్తి చేశారు.
మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలురు కంటే అధికంగా 6.11 శాతం బాలికలు పాస్ అయ్యారు. మొదటి స్థానంలో పార్వతీపురం జిల్లా.. చివరి స్థానంలో నంద్యాల జిల్లా నిలిచింది. ఇక జూన్ 2 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స తెలిపారు.