విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోతరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణ టెన్త్ ఫలితాల్లో 86.6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 59.46 శాతంతో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచినట్లు వివరించారు. ఈసారి 2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత సాధించగా.. 25 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని సబిత చెప్పారు. జూన్ 14 నుంచి 22వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. ఈనెల 26లోపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మంత్రి వివరించారు.
కాగా.. ఈనెల ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,620 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ ఏడాది 6 పేపర్లే కావడంతో వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేశారు. గతంలో లాగా ఫలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు http://results.bse.telangana.gov.in, http://results. bsetelangana.orgఅనే వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.