VijaySai Reddy: పదునైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి మౌనం దాల్చారు. ప్రత్యర్థి పార్టీ నాయకులకు సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉన్నట్టుండి తెరవెనుకకు జరిగిపోయారు. అసలు ఏం జరిగిందో అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం ఎవరిది అంటే పార్టీ నాయకుల నోట వినిపించిన ఒకే ఒక పేరు విజయసాయిరెడ్డి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడేళ్లు వరకూ ఆయన హవా కొనసాగింది. ముఖ్యమంత్రితో పాటు పార్టీలోను, ప్రభుత్వంలోను సాయిరెడ్డి క్రీయశీలకంగా వ్యవహరించారు. అధికార వర్గాల్లో తిరుగులేని నేతగా ప్రభావం చూపించారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.
దిల్లీకే పరిమితం !
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంపీ సాయిరెడ్డి తిరుగులేని ప్రభావాన్ని చూపించారు. స్థానిక నాయకత్వాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారని ప్రచారం జరిగింది. అదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ లావాదేవీలు జరగడంపై రాజకీయం ప్రభుత్వం విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సాయిరెడ్డి సొంత వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారనే నిందను కూడా పడాల్సి రావడం, వ్యతిరేకించే వారు బహిరంగంగా విమర్శలకు దిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన వాసుపల్లి గణేష్ వంటి నాయకులు సాయిరెడ్డిని బహిరంగంగానే విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీకి చేటు చేసేలా సాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్య్షాదులు తాడేపల్లికి క్యూ కట్టాయి. అనూహ్య పరిణామాల నడుమ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. సాయిరెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతల నుండి తప్పించారు. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని మరోమారు పొడిగిస్తారో లేదోననే సందేహాలు కూడా ఆ మధ్య కాలంలో వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎంపీ సాయిరెడ్డిని ప్రస్తుతం ఢల్లీిలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. సాయిరెడ్డికి విస్తృతంగా ఉన్న పరిచయాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం, క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేలా చేయడం, పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు ఢల్లీి స్థాయిలో పరిష్కారాలు చూడటం, ఎన్నికల నాటికి నాయకుల్ని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు.
తగ్గిన దూకుడు..
విజయసాయిరెడ్డి ట్విటర్ ఖాతాలో శనివారం ఉదయం రెండు పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అందులో ఒకటి బుద్ధ భగవానుడి బోధనల గురించి, మరొకటి హిందూ మహాసముద్రంలో చైనా నౌకల ప్రస్తావన. ఈ రెండు పోస్టులు కూడా హిందీలో పెట్టడం విశేషం. ఏపీ రాజకీయాలపై ఆయనకు ఎందుకు విరక్తి కలిగిందో తెలియదు. అయితే సొంత మీడియా సాక్షి సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది, ఏపీని విడిచిపెట్టి ఢల్లీిలో విజయసాయిరెడ్డి కులాసాగా గడుపుతుండడాన్ని అటు వైసీపీ నేతలు సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి స్పందన తెలియజేయడానికి ముందుకు రావడం లేదు, అంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న మాట సర్వత్రా అంతటా వినిపిస్తోంది.
ఆ వ్యవహారంతోనే దూరం పెరిగిందా !
విజయసాయిరెడ్డిని ఢల్లీికి పరిమితం చేయడానికి రకరకాల కారణాలు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీటిలో ఆర్దిక పరమైన లావాదేవీలే ప్రధాన కారణమని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు గత ఏడాది ఢల్లీి ప్రభుత్వంలో వెలుగు చూసిన విధానపరమైన వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపార వేత్తల ప్రమేయం కూడా ముఖ్యమంత్రికి ఆగ్రహం కలిగించినట్లు ప్రచారం జరుగుతోంది. సాయిరెడ్డి అల్లుడి సోదరుడు, ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడం, ఈ వ్యవహారాల గురించి చివరి వరకు ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిఎం ఆగ్రహానికి కారణమైనట్లు చెబుతున్నారు. రాజకీయంగా చేటు కలిగించే వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అనవసరపు వివాదాలను తలకెత్తుకోవడం వంటి కారణాలతోనే దూరం పెరిగినట్లు చెబుతున్నారు. దీనికి ఇతర కారణాలు కూడా కలగలసి ఎంపీని ఢల్లీికి పరిమితం చేసినట్లు చెబుతున్నారు.