దేశంలో సైబర్ నేరాలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘డిజిటల్ ఇండియా బిల్లు’ను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను ఎలక్ట్రానిక్స్, ఐటీ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. డిజిటల్ ఇండియా బిల్లుపై ఈ నెలలో సంప్రదింపులు ప్రారంభమవుతాయని, కొత్తగా తీసుకురాబోతున్న డిజిటల్ ఇండియా బిల్లు త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడిరచారు.
11 రకాల కంటెంట్‌లపై నిషేధం
కొత్తగా తీసుకురాబోతున్న డిజిటల్ ఇండియా బిల్లు 11 రకాల కంటెంట్లను నిషేధిస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడిరచారు. పోర్న్ కంటెంట్, పిల్లలకు హాని కలిగించే కంటెంట్, మరపరమైన ఉద్రిక్తతలు, పేటెంట్ ఉల్లంఘన, తప్పుదారి పట్టించే కంటెంట్, భారతదేశ ఐక్యత-సమగ్రతకు విఘాతం కలిగించే కంటెంట్, కంప్యూటర్ మాల్వేర్, చట్టవిరుద్దమైన, నిషేధిత ఆన్లైన్ గేమ్స్ వంటి కంటెంట్లను నిషేధిస్తుంది. ఇలాంటి కంటెంట్లను వ్యాప్తి చేసే ప్లాట్‌ఫారమ్‌ల చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.
ఇండియా బిల్లుతో సురక్షితం
2014లో ప్రపంచంలోనే డిజిటల్ అనుసంధానించబడిన దేశం మనది అని చంద్రశేఖర్ అన్నారు. ప్రస్తుతం మనదేశంలో 85 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 2025నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు చేరుకుంటుందని అంచానా వేశారు. ప్రస్తుత సవాళ్లకు యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆయన దుయ్యబట్టారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ చట్ట సవరణ నుంచి కొన్ని టెక్, సోషల్ మీడియా కంపెనీలు మినహాయింపును పొందాయని అన్నారు. ప్రస్తుతం కేంద్ర తీసుకురాబోతున్న డిజిటల్ ఇండియా బిల్లు ఇంటర్నెట్ సురక్షితంగా చేయడంతో పాటు యూజర్లను రక్షించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశాన్ని సురక్షిత, విశ్వసనీయ దేశంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు చంద్రశేఖర్ అన్నారు.