AP Introduce GPS : ఏపీలో ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్‌ విధానం !

0

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సీపీఎస్‌ వర్సెస్‌ జీపీఎస్‌గా మారింది పరిస్థితి.. ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. జగన్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద వివాదమే రాజుకుంది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్‌ విధానం తీసుకొస్తోంది. ఈ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. అయితే పాత పెన్షన్‌ విధానం ఓపీఎస్‌ కావాలనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌. ఎన్నికల ముందు మీరిచ్చిన హామీయే కదా అని అడుగుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కానీ, జగన్‌ మాత్రం జీపీఎస్‌ అంటున్నారు. కేబినెట్‌ ఆమోదంతో త్వరలో బిల్లు కూడా రెడీ కానుంది, మరి దీనిపై ఉద్యోగ సంఘాలు ఎలా రియాక్ట్‌ అవుతాయన్నది వేచి చూడాల్సిన అంశం. 

కొత్త జీపీఎస్‌లో ఏముంటుంది ?

ఇంతకీ ఓపీఎస్‌ ఏమిటీ, సీపీఎస్‌ ఎందుకొచ్చింది? కొత్తగా జీపీఎస్‌లో ఏముంటుంది? ఇవే సందేహాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అత్యధిక రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ అమలు చేస్తున్నారు. అంతకుముందు నుంచి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి ఓపీఎస్‌ అమలవుతోంది. అయితే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా రాష్ట్రంలో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ చాలాసార్లు ప్రకటించింది. జగన్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ప్రకటించారు. కట్‌ చేస్తే సీన్‌ మారింది. ఉద్యోగ సంఘాల నాయకులతో గడిచిన కొంత కాలంగా వివిధ దఫాలుగా జరిగిన చర్చల్లో ప్రభుత్వం తమ వైఖరి వెల్లడిరచింది. జీపీఎస్‌కు మాత్రమే అనుకూలమని, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేసే అవకాశం లేదని ప్రకటించింది జగన్‌ సర్కారు. కొత్త స్కీమ్‌ ప్రకారం పింఛను కోసం ప్రతీనెలా ఉద్యోగి జీతం నుంచి 10 శాతం కట్‌ చేస్తారు. ప్రభుత్వం మరో 10 శాతం నిధులు ఇస్తుంది. పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పింఛను చెల్లిస్తారు.

పింఛను గ్యారంటీ లేదు

 2004 నుంచి వివిధ శాఖల్లో చేరిన ఉద్యోగులతో పాటుగా ఉపాధ్యాయులు కలిపి దాదాపుగా 3 లక్షల మంది ఏపీకి చెందిన వారు ప్రస్తుతం సీపీఎస్‌ పరిధిలో ఉన్నారు. వారికి పింఛనును గతంలో మాదిరిగా ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, వేతనంలో నెలకు 10 శాతం చొప్పున మినహాయించిన దాని నుంచి చెల్లించడం వల్ల, పింఛను గ్యారంటీ లేదన్నది ప్రధాన ఆందోళన. పాత పెన్షన్‌ విధానంలో జీతంలో కోత లేదు. కానీ, సీపీఎస్‌లో ప్రస్తుతం 10 శాతం కోత అమలవుతోంది. ఇది మరింత పెంచే యోచనలో ఉన్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రాసిన లేఖల్లో ప్రస్తావించింది. గతంలో ఉద్యోగి పదవీ విరమణ నాటి వేతనాలను అనుసరించి లభించే పెన్షన్‌కు బదులుగా ఇప్పుడు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ నుంచి మాత్రమే పెన్షన్‌ చెల్లించే విధానం మూలంగా హఠాత్తుగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తగిన భద్రత లేదన్నది పలువురు ఉద్యోగుల ఆవేదన. పాత విధానంలో పింఛను ముందుగానే సరెండర్‌ చేయవచ్చు. దీన్నే కమ్యూటేషన్‌ అంటారు. సీపీఎస్‌లో ఆ సౌకర్యం లేదు. అంతేగాకుండా గ్రాట్యూటీ వంటి సదుపాయాలు కూడా ఉండేవి కాదు. పెన్షన్‌ గ్యారంటీ ఉండాలంటే ఓపీఎస్‌ అమలు కావాల్సిందేనన్నది ఉద్యోగ సంఘాల వాదన.

ఆంధ్రప్రదేశ్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌- ఏపీ జీపీఎస్‌ అని చెబుతున్న ఈ కొత్త విధానం ప్రకారం ఉద్యోగులందరికీ పెన్షన్‌ గ్యారంటీగా లభిస్తుందన్నది ప్రభుత్వ వాదన. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం అని మంత్రులు అంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు. సీపీఎస్‌ రద్దు కోసం చేస్తున్న ఉద్యమానికి అన్ని ఉద్యోగ సంఘాలు అండగా ఉన్నాయని, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఏపీలో సీపీఎస్‌ రద్దు కావాలని ఉద్యోగులు ఆశిస్తుంటే, జీపీఎస్‌ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పంచాయతీ ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి!

ఏమీ లేని చోట ఏదో ఒకటి రావటం సంతోషమే: వెంకట్రామిరెడ్డి

గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 16 శాతం హెచ్‌ఆర్‌ఏను అమలు చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీపీఎస్‌ ఉద్యోగులకు మేలు చేసేలా గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ తీసుకురావటం సంతోషదాయకమన్నారు. 50 శాతం పెన్షన్‌ ఇచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏమీ లేని చోట ఏదో ఒకటి రావటం సంతోషమే కదా అని ఆయన వ్యాఖ్యానించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !