జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ కామెంట్లపై ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ కాపుల మధ్య నిలబడి కాపులను తిడుతున్నారంటే.. చంద్రబాబు ఎంత పెద్ద స్కెచ్ వేశారో అర్థం అవుతుందన్నారు. నేను కాపు కాకపోయినా ముద్రగడ లాంటి వారిని గౌరవిస్తా. కాపుల కోసం ముద్రగడ ఆస్తిని, పదవులను కోల్పోయారు. కాపులకు అన్యాయం జరుగుతుందని తన మంత్రి పదవికి ముద్రగడ రాజీనామా చేశారు.. ముద్రగడ గొప్పవాడా.. పవన్ కల్యాణ్ ప్రేమించే చంద్రబాబు గొప్పవాడో కాపు సోదరులు గ్రహించాలని సూచించారు. కాపులలో ఒకరు ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటున్నా పవన్ లాంటి వ్యక్తుల వల్ల నష్టపోతున్నారని దుయ్యబట్టారు. ముద్రగడ ఒక్క అవినీతి చేశాడని నిరూపించినా.. నేను రాష్ట్రం విడిచి వెల్లిపోతానంటూ సవాల్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పవన్ కల్యాణ్ అనుకోవడాన్ని నేను తప్పపట్టడం లేదు, కానీ, వంగవీటి మోహన్ రంగా లాంటి వారిని చంద్రబాబు చంపించారు. ఈ విషయాన్ని అంత ఈజీగా మర్చిపోతారా..? అని ప్రశ్నించారు పోసాని. నేను ఓడినా పర్వాలేదు.. కానీ, చంద్రబాబుతో కలవను అని చిరంజీవి అన్నారు. అది చిరంజీవి నిజాయితీ. చిరంజీవి ఓడిపోవాలని కమ్మ కులస్తుల ఓట్లు ప్రజారాజ్యంకు వేయొద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారు.. ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో తెలియని పవన్ కాపులను తిట్టడం వెనక ఉన్న ఎజెండా ఏంటి? అంటూ నిలదీశారు. కమ్మ అయినా.. నాకే కాపులు అంటే ఇష్టం. అలాంటిది కాపు అయిన పవన్ మరో కాపును తిట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ను గత ఎన్నికల ముందు తిట్టిన ఇదే పవన్.. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు.. కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాల్సిన పవన్.. కమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు ఉత్తముడని పవన్ సపోర్ట్ చేస్తున్నారా..?
పవన్ ఎవరి కోసం పనిచేస్తున్నారో ఇప్పటికైనా కాపులు అర్థం చేసుకోవాలని సూచించారు. జగన్, ముద్రగడ కంటే చంద్రబాబు ఉత్తముడని చంద్రబాబుకు పవన్ సపోర్ట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించిన ఆయన.. పవన్ ఒకప్పుడు చాలా మంచి వాడు.. ఇప్పుడు చంద్రబాబు మాయలో ఎందుకు పడ్డాడో అర్థం కావడంలేదన్నారు.. చంద్రబాబు తన కమ్మ వాళ్లను ఒక్క మాట అనడు.. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం కాపులనే తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వ్యక్తి గత ద్వేషం పనికిరాదన్న ఆయన.. జగన్ ఏం పనిచేసినా పవన్ కు తిట్టడం అలవాటు అయ్యింది.. ఒకే టర్మ్ లో ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ తప్ప మరోవ్యక్తి లేరని ప్రశంసలు కురిపించారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నాని రెండు చెప్పులు చూపించారు. ఎలాంటి మచ్చలేని వ్యక్తి నాని.. అలాంటి కాపు మీకు గౌరవం. పవన్ తిట్టడం వల్ల నేను కూడా రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు. దమ్ముంటే పవన్ కల్యాణ్.. సీఎం జగన్ అవినీతిని నిరూపించాలని సవాల్ చేశారు.. కర్ణుడు గొప్పవాడు.. అయినా దుర్మార్గుల పక్కన నిలబడి నాశనం అయ్యాడు.. ఇప్పుడు పవన్ అదే చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.