బీజేపీది రాజకీయ కక్షే
బీఆర్‌ఎస్ పార్టీలోకి రాక ముందు నుంచే వారికి వ్యాపారాలు ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. వ్యాపారాలు చేస్తూ.. వారంతా లెక్క ప్రకారమే ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారని అన్నారు. ఐటీ దాడులతో భయపెట్టడం మూరత్వమే అవుతుందన్నారు. ఐటీ దాడులకు భయపడేది లేదన్నారు. దాడులతో ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేయడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. బీజేపీది రాజకీయ కక్షేనని.. ఎన్ని దాడులు చేసినా తాము ప్రజల పక్షానే ఉంటామన్నారు.
ఐటీశాఖ అధికారులు సోదాలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి), మర్రి జనార్థన్ రెడ్డి ( నాగర్ కర్నూలు) సంస్థల్లో ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీశాఖ అధికారులు సోదాలు చేశారు. 70 బృందాలుగా ఏర్పడ్డ ఆదాయపన్ను శాఖ అధికారులు అణువణువు గాలిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి తీర్థ గ్రూపు పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి జేసీ బ్రదర్స్ పేరిట వస్త్ర వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే.