తాము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక అమలు చేస్తున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మండుటెండలో సైతం లెక్కచేయక తనపై ఆప్యాయత చూపిస్తున్న ప్రజానీకానికి రుణపడి ఉంటానన్నారు. ఈ రోజు నుండి బడి గంటలు మోగుతున్నాయని.. అంతకన్నా ముందే విద్యార్థులకు చదువుల కానుకలు అందాలి అన్నదే తన ప్రయత్నమని చెప్పారు. ఒకటి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జగనన్న కిట్‌లు అందిస్తామని వెల్లడిరచారు. ఈ కిట్‌లో మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, వర్క్ బుక్స్, ఆక్స్‌ఫర్ట్ డిక్షనరీ, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఇస్తున్నామన్నారు.
మన విద్యార్థులు ప్రపంచాన్ని ఏలాలి
పిల్లలకు ఓట్లు ఉండవు కాబట్టి, వాళ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. కానీ ఈ జగన్ మామ ప్రభుత్వంలో 1000 కోట్లతో ప్రతి విద్యార్ధికి మంచి చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రూ.2400 విలువ చేసే వస్తువులు ఒక్కొక్క కిట్‌లో అందిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని.. ఇంగ్లీష్ విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా చర్యలు తీసుకున్నామని, మన విద్యార్థులు ప్రపంచాన్ని ఏలాలని ఆకాంక్షించారు. టోఫెల్ పరీక్షల కోసం విదేశీ సంస్థలతో తమ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది వెల్లడిరచారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ చూపించిన టీచర్స్‌కు అమెరికా పంపి, అక్కడ మెరుగైన శిక్షణ ఇప్పిస్తామన్నారు. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల్లో.. మన పిల్లలకు ఉపయోగపడేలా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, చాట్‌జీపీటీలలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇవే కాకుండా పిల్లలకు పౌష్టిక ఆహారం కూడా అందిస్తున్నామని తెలియజేశారు.‘అమ్మ ఒడి’ ద్వారా ప్రతి ఏటా 15 వేలు ఇస్తున్నామని.. ఈ ఒక్క పథకానికి రూ.19 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ వివరించారు. రూ.685 కోట్లతో విద్యార్థులకు, టీచర్‌లకు టాబ్స్ ఇచ్చామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 18న మళ్ళీ విద్యార్థులకు టాబ్‌లు అందిస్తామన్నారు. 33 వేల స్కూల్స్‌లో 6వ తరగతి నుండి డిజిటల్ బోర్డులతో విద్యా బోధన అమలు చేస్తున్నామన్నారు. నాలుగేళ్లలో విద్యారంగంపై రూ.60,329 కోట్లు ఖర్చు చేశామన్నారు. అలాగే.. జగనన్న విదేశీ దీవెనకు రూ.20 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలంటే పదవ తరగతి తప్పనిసరి అవ్వాలన్న ఆయన.. ప్రతి బిడ్డను చదివించేలా తల్లిదండ్రులు భాధ్యత తీసుకోవాలని సూచించారు.