వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసమా.. చంద్రబాబు కోసమా ఎవరి బాగు కోసం యాత్ర చేస్తున్నారని ఫైరయ్యారు. పవన్ పవర్ స్టార్ కాదు, ప్యాకేజీ స్టార్ అన్న విషయం అందరికీ తెలుసని.. ఆయన చంద్రబాబు కోసమే పనిచేస్తారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి రెడ్డి ద్వేషి.. కులాల మధ్య చిచ్చు పెట్టడమే అతని లక్ష్యం అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. కాకినాడలో రెడ్డి సామాజిక వర్గం తక్కువని.. అయినా తాను గెలిచానని పేర్కొన్నారు. పవన్‌కు దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. నా అంతు చూస్తానన్నావ్.. రాబోయే రోజుల్లో నీ అంతు చూస్తా.. నిన్ను తుక్కు తుక్కుగా ఓడిరచకపోతే.. నాపేరు చంద్రశేఖర్ రెడ్డే కాదంటూ పేర్కొన్నారు. చంద్రబాబుతో బేరం కుదరక ఇప్పుడు జనాల్లోకి వచ్చారని తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. తాను తలుచుకుంటే.. బ్యానర్ కూడా కట్టనివ్వనంటూ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో జీరో అంటూ వ్యాఖ్యానించారు.
ద్వారంపూడి క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తా
ద్వారంపూడి గూండా, రౌడీ.. ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తా.. అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న జనసేన కార్యకర్తల సమావేశంలో సైతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కల్యాణ్. అతని రౌడీయిజానికి భయపడేదే లేదని.. పేర్కొన్నారు. తొడగొట్టి మరీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఓడిరచి తీరతానంటూ శపథం చేశారు.