సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్రోసూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మేల్యే నంబూరు శంక్రరావు ముందుండి నడిపించారు. బాధ్యతలు భుజానికి ఎత్తుకుని సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెదరని ధైర్యం జగన్‌లో చూసినట్లు తెలిపారు. జగన్ పట్టుదల, అంకితభావం భావితరాలకు స్ఫూర్తి అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్థికి కట్టుబడి ఉన్నానన్నారు. మళ్ళీ జగనన్నను సిఎంను చేసేందుకు మొదటి గెలుపుని పెదకూరపాడు నుండి కానుక ఇస్తానన్నారు.
సుమారు రూ.149 కోట్లతో చేపట్టనున్న అమరావతి`బెల్లంకొండ డబుల్ రోడ్డు అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలాల ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని కొనియాడారు. అలాగే మాదిపాడు వద్ద కృష్ణానదిపై రూ.60 కోట్లతో నిర్మించ తల పెట్టిన హైలెవల్ బ్రిడ్జికి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనివల్ల ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల మధ్య రాకపోకలు సుగమం కానున్నాయన్నారు. దాదాపు 80 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. 14 ఏళ్లుగా సొంత భవనం లేకుండా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రూ.7.25 కోట్లతో నిర్మించి ప్రారంభించినట్లు చెప్పారు. సీఎం హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెదకూరపాడు నియోజకవర్గానికి తొలిసారి రావటం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయటం సంతోషంగా ఉందన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని క్రోసూరులో ప్రారంభించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.