YS Jagan Vs Ramoji : రామోజీని వెంటాడుతున్న జగన్‌ !

0
మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటివరకూ చందాదారుల  డిపాజిట్లు పక్కదారి పట్టించి వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారని రామోజీరావుపై అభియోగాలున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా పెద్దపెద్ద బ్యాంకులకు, ఫైనాన్స్‌ సంస్థలకు నిధులు మళ్లించినట్టు సీఐడీ గుర్తించింది. అందుకు సంబంధించి రూ.242 కోట్లను అటాచ్‌ చేశారు. గతంలో రూ.793 కోట్లు అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. సీఐడీ తాజా చర్యలతో కేసులో దూకుడును కనబరుస్తోంది. అసలు చందాదారులు ఫిర్యాదు చేయని కేసుగా అంతా భావించారు. కానీ సీఐడీ దర్యాప్తులో అవకతవకలు వెలుగు చూస్తుండడం విశేషం. చిట్‌ ఫండ్‌ కార్యకలాపాల కోసం ఉన్న నిబంధనలు ఉల్లంఘించారన్నది మార్గదర్శిపై అభియోగం. అందుకే సీఐడీ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించింది. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థ చైర్మన్‌ రామోజీరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌లపై పలు అభియోగాలు మోపుతూ కేసు నమోదుచేశారు. మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు జరిపి మేనేజర్లను సైతం బాధ్యులుగా చేశారు. కేసులు నమోదుచేసి కస్టడీలోకి తీసుకున్నారు. అటు తరువాత దర్యాప్తులో స్పీడు పెంచుతూ ఆస్తులను అటాచ్‌ చేశారు. తాజాగా మరో 242 కోట్లు అటాచ్‌ చేయడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

అవకతవకలు అనేకం !

మార్గదర్శి కార్యాలయాల బ్రాంచ్‌ మేనేజర్ల నివాసాలపై సైతం సీఐడీ దాడులు కొనసాగాయి. రోజంతా వారి ఇళ్లలో విస్తృత తనిఖీలు జరిగాయి. కీలక రికార్డులు, డాక్యుమెంట్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాలా రకాల అవకతవకలను గుర్తించారు. వెంటనే చైర్మన్‌ రామోజీరావుతో పాటు ఎండీ శైలజా కిరణ్‌కు నోటీసులిచ్చారు. వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. చాలారకాల ప్రశ్నలు వేశారు. విచారణలో భాగంగా ఇప్పటివరకూ రెండుసార్లు ఆస్తులను అటాచ్‌ చేశారు.

40 సంస్థల్లోకి మార్గదర్శి నిధుల మళ్ళింపు 

మొత్తం 40 సంస్థలకు మార్గదర్శి నిధులు మళ్లించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హోం మంత్రిత్వశాఖ జారీచేసిన జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. డీమార్ట్‌ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, సెంచరీ టెక్స్‌టైల్స్‌ వంటి సంస్థలకు నిధులను మళ్లించినట్లు గుర్తించారు.హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, నేషనల్‌ హైవే అథారిటీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, నిప్పాన్‌ ఇండియా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, టాటా కేపిటల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వ్యాన్‌టెల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల పేర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా- ఐసీఐసీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఆదిత్య బిర్లా కేపిటల్‌, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌లకుడిపాజిట్లను మళ్లించినట్లు హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి హరిష్‌ కుమార్‌ గుప్తా పేరిట జీవో జారీ అయ్యింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !