Telangana Congress CM Candidate : తెలంగాణ కాంగ్రెస్‌ సిఎం అభ్యర్థి భట్టి విక్రమార్క !?

0

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, శాసన సభ ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర వంద రోజులు దాటి కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ బ్రాండ్‌గా ఉన్న ఆయన.. పట్టు విడవని విక్రమార్కుడిలా నడిచిన ఈ పాదయాత్రతో కొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా మారారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతల మధ్య ఐక్యతకు వేదికగా ఆయన చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ నిలిచింది. ముఖ్యంగా విక్రమార్క చేపట్టిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ అనుమతి ఇచ్చిన నాటి నుంచి పార్టీలో చేరికల సంఖ్య పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు కూడా భట్టి కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయంలో భట్టి చీఫ్‌ విప్‌గా.. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌గానూ చేశారు. ఇంకా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నుంచి స్ఫూర్తి పొందిన విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. మార్చి 16న అదిలాబాద్‌ బోథ్‌ నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఊపిరి పోసింది.

నాయకుడిగా గుర్తింపు !

పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రతో బడుగు బలహీన వర్గాలవారికి భట్టి దగ్గరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంతో మంది సీనియర్‌లు ఉన్నప్పటికీ వారి అందరిపై పై చేయి సాధించాలంటే ఎన్నికల ముందే జనంలో గుర్తింపు, కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్ద పరపతి కోసం పాదయాత్రను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రతో రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాధులు వేసుకున్నారు అనే చెప్పాలి. రాజకీయ అనైక్యతకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. సామాజిక వర్గంగా వెనుకబడిన కులాలకు చెందిన నాయకుడు కావటంతో ఆయా సామాజిక వర్గాలు ఆయన నాయకత్వానికే మొగ్గుచూపే అవకాశం ఉంది. ఎలా చూసినా భట్టికే సిఎం పగ్గాలు అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భట్టి చేపట్టిన ఈ పాదయాత్రకు లభిస్తున్న విశేష ఆదరణను చూసి కాంగ్రెస్‌ అధినేత మల్లిఖార్జున ఖర్గే సహా పలువురు తరలి రావడమే కాక సభల్లో పాల్గొన్నారు. స్వయంగా రాహుల్‌ గాంధీ కూడా ఈ పాదయాత్ర గురించి ఆడిగి తెలుసుకుంటున్నారు. అంతేనా.. భట్టి తన పాదయాత్రలో భాగంగా పలువురు నాయకులను బీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫలితంగానే ఖమ్మం వేదికగా పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు.ఇంకా పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా గడిచిన వంద రోజుల్లో భట్టి అనారోగ్యం కారణంతో చిన్న విరామం మినహా ఎక్కడా ఆగలేదు. పండగ పబ్బం అని లేకుండా అనునిత్యం ప్రజలతోనే నడిచారు. ఎండలోనే వందో రోజు వరకు నడిచిన ఆయన.. ఇప్పటివరకు 1150 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు. 

వైఎస్‌ఆర్‌ని ఫాలో అవుతున్న భట్టి !

సీఎల్పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో పూర్తిగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఫాలో అవుతున్నారు. ప్రతి విషయంలోనూ వైఎస్‌నే అనుకరిస్తున్నారని ఆయన అనుచరులే మాట్లాడుతున్నారు. వైఎస్‌ పంచెకట్టుతో సహా హావభావాల వరకు అన్నీ ఫాలో అవుతున్నారట. ప్రజలతో మాట్లడటం, అభివాదం చేయడం అన్నీ వైఎస్‌ఆర్‌లా ఉండేలా చేస్తున్నారట మల్లు భట్టి విక్రమార్క.. వైఎస్‌ఆర్‌ను రాజకీయ గురువుగా భావిస్తారని, ఇప్పటికీ అదే అభిమానాన్ని చూపిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పాదయాత్రలో భట్టి ప్రజలతో మాట్లేడటప్పుడు, నిద్రపోయేటప్పుడు, స్నానం, హెల్త్‌ చెకప్‌ టైమ్‌లో తీసిన ఫోటోలను..వైఎస్‌ఆర్‌ పాదయాత్రలో తీసిన ఫొటోలతో జత చేస్తున్నారు. నాడు రాజన్న.. నేడు భట్టి అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు భట్టి అనుచరులు. వైఎస్‌, భట్టి ఫోటోలను పక్కపక్కన పెట్టి తిప్పుతున్నారు. 

సెంటిమెంట్‌ ప్రకారం...సిఎంగా భట్టి విక్రమార్క !

పాదయాత్రలో.. మే 18, 2003లో వైఎస్‌ అస్వస్థకు గురయ్యారు. పాదయాత్ర శిబిరంలోనే డాక్టర్లు ఆయనకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. భట్టి కూడా తన పాదయాత్రలో అనారోగ్యానికి గురైయ్యారు. మే 18, 2023 రోజునే డాక్టర్లు ఆయనకు చికిత్స చేశారు. అప్పటి వైఎస్‌ఆర్‌ ఫోటోకు.. భట్టి ట్రీట్‌మెంట్‌ ఫోటో జత చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు ఆయన అనుచరులు. సీఎల్పీ లీడర్‌గా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి..ప్రజా ప్రస్థానం పేరుతో 2003లో పాదయాత్ర చేశారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సీఎల్పీ హోదాలో భట్టి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుందని భట్టి సెంటిమెంట్‌ గా ఫీలవుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారట భట్టి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !