విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ లో పాత్రధారులే పట్టుబడ్డారా? సూత్రధారులు వేరే ఉన్నారా? తెర వెనుక ఉండి వారు నాటకం ఆడిరచారా? వీరు రాజకీయ ప్రత్యర్థులా? లేకుంటే వ్యాపార రంగంలో పోటీదారులా ? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. కిడ్నాప్‌కు గురైంది సాక్షాత్తు ఎంపీ కుమారుడు, భార్య, సన్నిహితుడైన ఆడిటర్. ముందుగా కుటుంబసభ్యులు, తరువాత తన వ్యాపార లావాదేవీలు చూసే ఆడిటర్. సహజంగానే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయం అని తెలుస్తున్నా అది రాజకీయాలకు సంబంధించిందా ? లేక వ్యాపార సంబంధమైనదా అని తేలాల్సి ఉంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిగ్ షాట్. ఏపీలోనే అతిపెద్ద బిల్డర్. రాజకీయంగా కూడా దూకుడుగా ఉన్నారు. సహజంగానే ఆయనకు ప్రత్యర్థులు ఉంటారు. వారే ఈ పనికి పురిగొలిపి ఉండవచ్చు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంపీకి చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. దీంతో ఆర్థిక లావాదేవీల్లో తేడావచ్చిన వారే కిడ్నాపర్లను ముందుపెట్టి కథ నడిపించి ఉండవచ్చు కదా అని పోలీస్ వర్గాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇలా టార్గెట్ చేసిన వారు ఏ రంగానికి చెందిన వారు అన్నది పోలీసులే సమగ్ర దర్యాప్తు చేసి తేల్చాలి.
ఎంపీ బయటకు చెప్పుకోలేని విషయాలు దాగి ఉన్నాయా ?
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ కిడ్నాప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు.. ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందన్న ఆయన.. ఈ కేసును సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కోరారు. ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఆశ్చర్యానికి గురి చేసిందన్న ఆయన.. ఎంపీ ఇంటికి ఒక ఆకు రౌడీ వెళ్లాడంటే సాధారణమైన విషయం కాదు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి వుందనే అనుమానం కలుగుతోందన్నారు. సినిమా స్టోరీని మించిన నిజంగా జరిగిన ఘటన ఇది. ఈ ఘటన వెనుక ఎంపీ బయటకు చెప్పుకోలేని విషయాలు దాగి ఉన్నాయి అన్నారు. భార్య, కుమారుడు ఎక్కడ ఉన్నారో ఎంవీవీ ఎందుకు గమనించలేదని అంతుబట్టని విషయమన్న ఆయన, ఎంపీ కొడుకు ఫోన్ చేస్తే.. రోజు స్టేషన్‌కు రావాల్సిన రౌడీషీటర్ కదలికలను వదిలేస్తారా..? అని ప్రశ్నించారు.
సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలి
విశాఖలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోం మంత్రి హెచ్చరించారని గుర్తుచేశారు విష్ణుకుమార్ రాజు.. అది జరిగిన రెండు రోజుల్లోనే ఎంపీ కుటుంబం బాధితులుగా మారాన్న ఆయన.. గంజాయి మత్తులో జరిగిన అరాచకం గురించి తెలుసుకుని నివ్వెరపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. ఎంపీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగితే ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక, ఈ వ్యవహారంలో కడప, పులివెందుల బ్యాచ్‌లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.. సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని సూచించారు. ఇక, ఈ కేసులో ఏపీ పోలీసులు నిస్పాక్షిక విచారణ జరుపుతారన్న నమ్మకం లేదన్నారు విష్ణుకుమార్ రాజు.. నిజాలు తేలాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్ మోడల్ పోలీసింగ్ అమలు చేస్తేనే అరాచకాలు తగ్గుతాయని సూచించారు. ఇది కిడ్నాప్ కాదు.. సెటిల్ మెంట్ వ్యవహారం అనేది మా అభిప్రాయంగా పేర్కొన్నారు. ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా..? లేక ఇతర కారణాలా..? అనేది విచారించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. కాగా, ఎంపీ ఫ్యామిలీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు.