Young Leaders vs Senior Leaders : గుంటూరులో నవతరం నాయకులకు సీటు దొరుకుతుందా ?

0

 

గుంటూరు రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ పడుతున్న నాయకుల జాబితా రోజురోజుకి పెరుగుతోంది. సీట్లు కోసం పోటీ పెరగటంతో పార్టీ అధినాయకత్వాన్ని తలనొప్పులు తప్పేలా లేవు. నవతరం యువనాయకులు ఏకంగా సీనియర్‌ నాయకుల సీట్లకే ఎసరు పెడుతుండటంతో  రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరిపేటకు ప్రత్తిపాటి పుల్లారావు ఎప్పటినుండో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో కీలక పదవులతో పాటు మంత్రిగాను సేవలు అందించారు. అలాంటి ఉద్ధండుడైన నాయకుడికి ఇప్పుడు చెక్‌ ఒకరు చెప్పబోతున్నారు. అలాగే తాడికొండ నియోజకవర్గంలోనూ మరో సీనియర్‌ నాయకుడు తెనాలి శ్రవణ్‌కుమార్‌ సీటు వదలుకోక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాజధాని ప్రాంతంలో ప్రజలకు ఎంతో దగ్గరైన నాయకుడిగా పేరున్నా ఈ సారి సీటు దక్కే అవకాశాలు కనిపించటం లేదు. ఇక పెదకూరపాడు నియోజకవర్గానికి వస్తే మాజీ ఎమ్మేల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ రెండు సార్లు ఎమ్మేల్యేగా గెలిచి, ఒకసారి ఓడిపోయారు. ఈసారి ఈ సీటు త్యాగం చేయాల్సి వస్తుందా అని లోలోన మదనపడుతున్నారు. పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా,  సీటు దక్కుతుందా లేదా ఈ ముగ్గురు నాయకులు  సతమతమవుతున్నారు. ఇంతకీ ఈ ముగ్గురు నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న నవతరం యువనాయకులు ఎవరంటే...భాష్యం ప్రవీణ్‌, తోకల రాజవర్థన్‌రావు, వట్టికుంట శేషగిరిరావు. 

సేవా కార్యక్రమాలతో జనంలోకి 

ఈ ముగ్గురు నాయకులు నారా లోకేష్‌కు బాగా సన్నిహితులు, తమ తమ నియోజకవర్గాల్లో పాగా వేసి ట్రస్ట్‌ల పేరుతో విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ జనానికి దగ్గరవుతున్నారు. రోజురోజుకి తమ ప్రాంతాల్లో ప్రాబల్యం పెంచుకుంటూ తన యువనాయకుడు లోకేష్‌ సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి లోకేష్‌ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రోద్భలంతోనే వీరు ముగ్గురు దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఎలాగైనా మారవచ్చు, మార్చవచ్చు, అందుకే వీరు ముగ్గురు లోకేష్‌కి అతి సన్నిహితంగా మెలగుతూ సీటు కోసం లోకేష్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు వినికిడి. భాష్యం ప్రవీణ్‌, వట్టికుంట శేషగిరిరావులు ఇద్దరూ లోకేష్‌ మనుషులుగా చలామణి అవుతుండగా, తోకల రాజవర్థన్‌ రావు రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్‌ వంటి సీనియర్‌ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావుకి ఇచ్చే క్రమంలో భాష్యం ప్రవీణ్‌కి గుంటూరు 2 కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అలాగే తాటికొండ తెనాలి సీటు మార్పు తథ్యంగా కనిపిస్తోంది. ఈయనకు వేమూరు లేదా బాపట్ల ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం ఉంది. ఇక పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆర్థిక సమస్యలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో తన వియ్యంకుడు జి.వి. ఆంజనేయులు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని అధినేత చంద్రబాబుకి మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆర్థిక బలంతో రాజకీయాలు చేస్తున్న వట్టికుంట శేషగిరిరావును ఎంత మాత్రం ఢీ కొంటారో చూడాలి. సీటుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. పాత తరం నాయకులు అందరూ అధినేత చంద్రబాబును నమ్ముకోగా, యువతరం నాయకులు చినబాబు లోకేష్‌ని నమ్ముకుని కోట్లలో ఖర్చు చేస్తున్నారు. చివరకి సీటు ఎవరిని వరిస్తుందో కాలమే నిర్ణయించాలి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !