వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం
కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించి అక్కడ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ అధిష్టానంలో మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగింది. దాంతో చకచకా పావులు కదిపి, దారి తప్పి తెలంగాణలో ఒంటరిగా తిరుగుతున్న జగనన్న బాణాన్ని తన అస్త్రంగా మార్చుకొని ఏపీ వైపు గురి పెడుతోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వాటిని ధృవీకరించినట్లు సమాచారం. ఆయన చెప్పిన దాని ప్రకారం, జూలై 6న ఇడుపులపాయకు ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ రానున్నారు. అక్కడ వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బహిరంగసభ లేదా కాంగ్రెస్ నేతలతో సమావేశం జరుగుతుంది. దానిలో వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తారు. అక్కడే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొంటారు.
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు !
ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీకి గిడుగు రుద్రరాజు అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలు ఏవీ నిర్వహించడం లేదు. కనుక ఆయన చేతిలో నుంచి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకొని వైఎస్ షర్మిలకు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తను కాంగ్రెస్ పార్టీ, వైఎస్ షర్మిల ఇంకా ధృవీకరించవలసి ఉంది. జూలై 3న రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ఖమ్మంలో జరుగబోయే బహిరంగసభలో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోతున్నారు. బహుశ అప్పటికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై పూర్తి స్పష్టత రావచ్చు.
అన్ననే విమర్శించాల్సి వస్తే...
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరినా, పగ్గాలు చేపట్టినా ముందుగా ఇబ్బంది పడేది ఆమె సోదరుడు సిఎం జగన్మోహన్ రెడ్డే అని వేరే చెప్పక్కరలేదు. ఆమె రాష్ట్ర రాజకీయాలలోకి వస్తే ప్రధానంగా అధికార వైసీపీని, ప్రభుత్వాన్ని, జగనన్న పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి మాట్లాడటం ఖాయం. వాటి గురించి మాట్లాడకుండా ఆమె ఏపీలో రాజకీయాలు చేయలేరు. చేసినా ప్రయోజనం ఉండదు. సిఎం సొంత చెల్లెలే ఆయనపై విమర్శలు, ఆరోపణలు చేయడం మొదలుపెడితే, వైసీపీ విశ్వసనీయత దెబ్బ తింటుంది. కానీ ఆమెపై ఎదురుదాడి చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సాహసించలేరు. ఒకవేళ చేసినా దాని వలన వైసీపీకే నష్టం, ఆమె పట్ల ప్రజలకు సానుభూతి కలుగుతుంది. కనుక జగనన్న బాణం గురితప్పి తిరిగి వచ్చి ఆయనకే గుచ్చుకొంటే రాజకీయాలలో ఇదో విచిత్రమే అవుతుంది.