ఇండ్ల నిర్మాణానికి డెడ్‌లైన్ !
అమరావతిలోనే ఇళ్ళ నిర్మాణం ఇంత త్వరగా పూర్తి చేయాలని ఎందుకు కంకణం కట్టుకున్నారు ? మరి రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో పేదల ఇండ్ల నిర్మాణంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు ? అంటే మాత్రం కేవలం రాజకీయ ప్రయోజనం తప్ప మరోది లేదు. కేవలం అమరావతి ప్రాంతంలో మాత్రమే ఇళ్ళ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో జగన్ ముందుకు కదులుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజధాని ప్రాంతం మాస్టర్ ప్లాన్‌ను ధ్వంసం చేయటం అసలు ఉద్ధేశ్యం కాగా, రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వటం ద్వారా వాళ్ళకు రాజధాని ప్రాంతంలో నివసించే హక్కు కల్పించి, పేదల పక్షపాతిగా ప్రజల మన్ననలు పొంది మంగళగిరి, తాటికొండ నియోజకవర్గాల ప్రజలను వైసీపీ వైపు తిప్పుకునేందుకు పకడ్బందీగా వ్యూహం రచించారు. కానీ ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. ఇళ్ళ పట్టాల పంపిణీకే ప్రభుత్వం పెద్ద పోరాటం చేయాల్సి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని కొందరు ఇళ్ళ పట్టాలను అడ్డుకున్నారు. పోరాటం చేసి కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న ప్రభుత్వం తర్వాత ఇళ్ళ నిర్మాణాలకు రెడీ అయ్యింది. వెంటనే మళ్ళీ కొందరు కోర్టుకెక్కారు. ఇళ్ళ పట్టాల పంపిణీకి మాత్రమే అనుమతిచ్చింది కానీ ఇళ్ళ నిర్మాణాలకు కాదన్నది వాళ్ళ వాదన. వాళ్ళ అసలు భయం ఏమిటంటే ఇక్కడ 51 వేల మంది నివాసాలుంటే టీడీపీకి ఇబ్బందులు తప్పవని. ఎలాగంటే ఇప్పుడు నిర్మించబోయే ఇళ్లు అన్నీ మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోనే ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో మంగళగరిలో పోటీ చేయాలని అనుకుంటున్న లోకేష్‌కు మరోసారి ఓటమి తప్పదని టీడీపీ భయపడుతోంది. ఇదే వివాదంపై కోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని జడ్జి విచారణ సందర్భంగానే అడిగారు. ఇప్పుడు చేస్తున్న వందలాది కోట్ల రూపాయలు వృధా అవుతాయి కదాని ప్రశ్నించారు. విచారణ ముగిసి తీర్పును జడ్జి రిజర్వు చేశారు. ఎప్పుడు తీర్పొస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఇళ్ళ నిర్మాణాలను మొదలుపెట్టేస్తోంది. ఇక్కడే జగన్ ధైర్యమేమిటో అర్థంకావటంలేదు. జడ్జి అడిగినట్లే తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రతిపక్షాలపై నెపం వేసి ప్రజల సానుభూతి పొందవచ్చు అన్నది ప్రభుత్వం ఉద్ధేశ్యం కావచ్చు లేదా కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే నిర్మిస్తున్న ఇళ్ళన్నీ పేదల కోసమే కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని అంచనా కావచ్చు. ఏది ఏమైనా జగన్‌ను అర్థం చేసుకోవటం ఎవరివల్లా కావటం లేదు.
వైనాట్ 175 ?
ప్రత్యర్థులకు ఆలోచనలకు అంతచిక్కని పదునైన వ్యూహాలను రచించటంలో జగన్‌కు జగనే సాటి. ఆయన వ్యూహాలన్ని పద్మవ్యూహంలా ఉంటాయి. ప్రత్యర్థులు అర్థం చేసుకునేలోగే మరో చక్రవ్యూహంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవటంతో పాటు ప్రాంతాల వారీగా, కులాలవారీగా, మతాల వారీగా ప్రతి సామాజిక వర్గానికి ఒక్కో వ్యూహంగా ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఎ.సి, ఎస్టీ, బి.సీ, మైనారిటీ వర్గాలే టార్గెట్‌గా ముందుకు కదులుతున్నారు. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలను తన పథకాలతో అక్కున చేర్చుకుని ఓటు బ్యాంకుని స్థిరీకరించుకుంటున్నారు. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఈసారి 175 సీట్లు సాధించే దిశగా తన సైన్యాన్ని సమయత్తం చేస్తున్నారు. ఏ ధైర్యంతో 175 సీట్లు సాధిస్తాం అని అంటున్నారో నాయకుడికి అంతు చిక్కటం లేదు. సర్వేలు సైతం జగన్‌కి జై కొడతుంటంతో ప్రతిపక్ష నాయకుల వెన్నులో వణుకు పుడుతుంది. ఆయన వ్యూహాలకు రాజధానిలో పేదలకు ఉచిత ఇళ్ళ నిర్మాణమే ఒక గొప్ప ఉదాహరణ. ఇళ్ళు పూర్తయినా, కాకపోయినా వైపీపీకి లాభం చేకూరేలా చక్కగా ప్లాన్ చేశారు. ఇదీ నాయకుడి చతురతకు నిదర్శనం. ఇతర పార్టీల నాయకులను గందరగోళం, అయోమయానికి గురిచేరి, తేరుకునేలోపే తన వ్యూహాలను చాకచక్యంగా అమలు చేస్తున్నారు.