బెంగళూరు వేదికగా విపక్ష నేతల కూటమి సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సమావేశంలో విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరును నిర్ణయించారు. ప్రతిపక్షాల ఫ్రంట్‌కు ఇకపై ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి I-N-D-I-A గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా వెల్లడిరచారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడిరచడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్న విపక్షాలు రెండో విడతగా బెంగళూరులో భేటీ అయ్యాయి. ఇందులో ఒకటైన ‘కూటమి పేరు’పై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదారు పేర్లను నేతలు పరిశీలించారు.అయితే, కూటమి పేరులో ఫ్రంట్ అనే పదం ఉండకూడదని కొన్ని పార్టీలు సూచించినట్లు సమాచారం. దీంతో I-N-D-I-A (Indian National Development Inclusive Alliance ) అనే పేరును ప్రతిపాదించగా.. అత్యధిక పార్టీల నేతలు ఏకీభవించాయి. ఈ పేరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదించినట్లు ఖర్గే తెలిపారు.
ఆశావాహులు ఎందరో...కానీ ప్రధాని పదవి ఎవరికో !
కాగా, రెండవ రోజు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రకటన చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే ప్రకటన. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవి మీద ఆసక్తి లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.‘ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదు. మా తాపత్రయం అధికారం సాధించడం కోసం అసలే కాదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించేందుకే మా ప్రయత్నం అంతా’’ అని ఖర్గే అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మేము 26 పార్టీల నుంచి ఒక్కటయ్యాము. ఈ కూటమి 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీ తనకు తానుగానే 303 సీట్లు గెలవలేదు. చాలా పార్టీల కూటమి కారణంగా వాళ్లు ఓట్లు, సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు వారి కంటే బలమైన కూటమిని మేము రూపొందించాము’’ అని అన్నారు. వాస్తవానికి విపక్షాల ఐక్యతలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వమే చాలా క్లిష్టంగా సాగుతూ వస్తోంది. ఈ కారణంగానే చాలా పార్టీలు కలవలేకపోతున్నాయి. ఇక దేశంలో పెద్ద సంఖ్యలో ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే. అంతే కాకుండా చాలా రోజులుగా కూటమి ప్రయత్నాలపై జరుగుతున్న చర్చతో పాటే ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై కూడా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ తరపున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ నేతలు బలంగా చెబుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి కుర్చీ కోసం పోటీ పడటం లేదని ఏకంగా పార్టీ అధ్యక్షుడే చెప్పడం గమనార్హం. రాజకీయంగా బయటికి ఎన్ని చెప్పినప్పటికీ అధికార కుర్చీ కోసమే రాజకీయ పార్టీలు పొత్తులు, ఎత్తులు చేస్తుంటాయి. చాలా అరుదైన సందర్భాల్లో కుర్చీ త్యాగం చేయాల్సి వస్తుంది. వాస్తవానికి మిగిలిన విపక్ష పార్టీలతో చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా బలం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి 19.49 శాతం ఓట్లు సాధించింది. ఈ లెక్కన చూసుకుంటే విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే కావడం కొంత వరకు సమంజసమే కానీ.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు ఒప్పుకోవడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒక్క స్టాలిన్ మినహా మరెవరూ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదు. అలా అని బయటికి తమ విముఖతను తెలియజేయలేదు కానీ.. మౌనంగా ఉన్నారు. ఇప్పటి పరిస్థితి కూడా దాదాపుగా అలాగే కనిపిస్తోంది. ఇకపోతే ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఆశావాహులుగా ఉన్నారు. పలుమార్లు దీనిపై ఆయన వర్గీయులు ప్రకటనలు కూడా చేశారు. ఇక మమతా బెనర్జీ సైతం కాస్త ఆశగానే ఉన్నప్పటికీ.. గోవా అసెంబ్లీ ఎన్నికల అనంతరం సైలైంట్ అయ్యారు. వీరిద్దరు మినహా ప్రస్తుత మెగా విపక్షాల కూటమి నుంచి అంత స్థాయిలో ప్రధాని అభ్యర్థులు అయితే లేరు.
26 పార్టీల నేతల హాజరు.
నేటి భేటీలో కనీస ఉమ్మడి కార్యక్రమ (సీఎంపీ) రూపకల్పనకు ఒక ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం వంటివాటిపై చర్చించారు.రెండో రోజు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఎంలు మమతాబెనర్జీ (పశ్చిమ బెంగాల్-టీఎంసీ), నీతీశ్ కుమార్ (బిహార్-జేడీయూ), ఎం.కె.స్టాలిన్ (తమిళనాడు-డీఎంకే),అరవింద్ కేజ్రీవాల్ (దిల్లీ-ఆప్), భగవంత్ మాన్ (పంజాబ్-ఆప్), హేమంత్ సోరెన్ (రaారండ్-రaారండ్ ముక్తి మోర్చా), మాజీ ముఖ్యమంత్రులు- అఖిలేశ్ యాదవ్ (ఉత్తర్‌ప్రదేశ్), ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), లాలూ ప్రసాద్ యాదవ్ (బిహార్), మెహబూబా ముఫ్తీ (జమ్మూ-కశ్మీర్), సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎండీఎంకే నేత వైగో, జయంత్ చౌధరి (ఆర్‌ఎల్‌డీ) తదితరులు పాల్గొన్నారు.