తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు గంటా రవితేజ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా ? వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా పావులు కదుపుతున్నారా ? అవును అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే గంటా రవితేజ కేవలం గంటా శ్రీనివాస్‌కే కాకుండా టిడిపిలో మరొక కీలక నేత మాజీ మంత్రి అయిన నారాయణ సంస్థల అధినేత నారాయణకు స్వయానా అల్లుడు. ఈ ఇద్దరూ సీనియర్ నాయకుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో గంటా రవితేజ సీటు తెచ్చుకోవటం పెద్ద పనేం కాదు. సడెన్‌గా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గంటా రవితేజ ప్రత్యక్షం కావడానికి కారణాలేంటి? లోకేష్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్న రవితేజ 2024 ఎన్నికల టార్గెట్‌గా ముందుకు వెళ్తున్నారా? ఈ ఆసక్తికర కథనం మీ కోసం.
గంటా శ్రీనివాస్‌రావుకు ప్రత్యేక స్థానం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గంటా శ్రీనివాస్‌రావుకు ప్రత్యేక స్థానం ఉంది. 1999లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన ఆ తర్వాత నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ గెలిచిన నేపథ్యం ఆయనిది. పోటీచేసిన చోట తిరిగి రెండోసారి పోటీ చేయకుండా వరుస విజయాలు సాధించిన ఘనత అయనది. ప్రస్తుతం 63 ఏళ్ల వయసున్న గంటా శ్రీనివాసరావు 2024లో భీమిలి నుంచి పోటీ చేసి ఆ తర్వాత రాజకీయ విరమణ ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు కుమారుడు, మాజీ మంత్రి నారాయణ అల్లుడు కావటంతో వీరిరువురూ కలిసి గంటా రవితేజని తమ రాజకీయ వారసుడిగా ముందుకు తీసుసుకాబోతున్నారా అనే చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటి వరకు రవితేజ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నది పెద్దగా లేదు. కానీ గత వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్‌తో కలిసి పాల్గొంటున్నారు గంటా రవితేజ. ప్రస్తుతం నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నారాయణ ఉన్నారు. తెలుగుదేశం ఆఫీసు వ్యవహరాలను చక్కబెడుతున్నారు. నారాయణ కూడా అనారోగ్యం రీత్యా వయసు పైబడ్డ నేపథ్యంలో తాను రాజకీయంగా పోటీ చేయాలా? లేదంటే తన వారసులుగా ఎవరి చేతనైనా పోటీ చేయించాలా ఆన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గంటా రవితేజతో పాటు తన ఇద్దరు కూతుర్లు తో కలిసి లోకేష్ యువగళం పాదయాత్రలో కనిపించడం ఆసక్తికరమైన చర్చికి దారితీస్తోంది. వాస్తవానికి గత కొంతకాలంగా విశాఖలో అనకాపల్లి కానీ చోడవరం నియోజకవర్గాల నుంచి రవితేజ చేత పోటీ చేయించాలన్న ఆలోచన గంటా శ్రీనివాసరావుకు ఉందన్న చర్చ నడిచింది. తనతో పాటు అవసరమైతే తన వియ్యంకుడైన నారాయణ కోటాలో అయినా రవితేజ కి టికెట్ తెచ్చుకుంటారన్న చర్చ కొనసాగుతూ వస్తుంది.
నారాయణ రాజకీయ వారసుడిగా
అయితే గంటా కుమారుడికి టికెట్ ఇస్తే ఇప్పటికే టికెట్లు తన కుమారుడి కోసం టికెట్ అడుగుతున్న అయ్యన్నపాత్రుడు, మరొకవైపు బండారు సత్యనారాయణ మూర్తిలు కూడా తన కుమారులకు టికెట్ అడగాలన్న ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి అది అంత సాధ్యం కావచ్చన్న విశ్లేషణలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ విశాఖలో వీలు కాకపోతే నెల్లూరు నుంచి నారాయణ కోటాలో, నారాయణ రాజకీయ వారసుడిగా గంటా రవితేజను బరిలోకి దిగే అవకాశం ఉందా అన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతోంది. 2019లో కూడా నారాయణ నెల్లూరు నుంచి పోటీ చేసి ప్రస్తుత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఓటమి పొందారు. తిరిగి 2024లో అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రం నారాయణనే అక్కడి నుంచి బరిలోకి దించాలని ఆలోచిస్తోందట. అయితే నారాయణ ఆరోగ్యం, వయసు సహకరిస్తుందా? ఒకవేళ లేదంటే తన రాజకీయ వారసుడు, తన అల్లుడిని నెల్లూరు నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనలో నారాయణ ఉన్నారట. అందుకే కుమార్తె, అల్లుడితో కలిపి నారాయణ కూడా ఇప్పుడు లోకేష్ యువ గళం పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో నెల్లూరు నియోజకవర్గంలో పాల్గొంటూ ఉన్నారు.
నెల్లూరు నియోజకవర్గంలో సమీకరణలు ఎలా ఉంటాయి
ఇదే సమయంలో ఒకవేళ అక్కడ గంటా రవితేజ నిలబడితే సమీకరణలు ఎలా ఉంటాయి? విజయవకాశాలు ఎంత ఎంత మేరకు ఉండొచ్చు? అని వియ్యంకులైన ఈ మాజీ మంత్రులు గంటా, నారాయణాలు ఇరువురు చర్చిస్తున్నట్లు సమాచారం.దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఒకవేళ తన అల్లుడికి టికెట్ ఇప్పిస్తే తాను గెలిపించుకుంటానని అధిష్టానానికి చెప్తే అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఒకవేళ గంటా కుమారుడికి నారాయణ అల్లుడి కోటలో ఇస్తే మిగతా ఇప్పటికే తమ కుమారులకి టికెట్లు అడుగుతున్న అయ్యన్నపాత్రుడు బండారు సత్య నారాయణ మూర్తితో పాటు మిగతా వాళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? లాంటి అనేక రకాల చర్చలకు ప్రస్తుతం గంటా రవితేజ అంశం తావిస్తోంది.