ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే మనసుకు బాధగా ఉంటోందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో లోకేశ్ సమావేశం అయ్యారు. జగన్ పాలనలో అన్ని రంగాల నిపుణులు బాధితులుగా మారారని అసహనం వ్యక్తం చేశారు. ఎకనామిక్ యాక్టివిటీని పూర్తిగా నిలిపేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని తేల్చి చెప్పారు. అప్పు చేసి సంక్షేమం చెయ్యడం గొప్ప కాదని.. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందించే స్థాయికి రాష్ట్రం రావాలన్నారు. నిపుణులందరూ ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లోకేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు అందరినీ ఒప్పించి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాయలసీమని ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ హబ్‌గా తయారు చేస్తాం. విశాఖని ఐటీ హబ్‌గా మారుస్తాం. తెలుగుదేశం హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా ప్రకటించింది. జగన్ పాలనలో ఐటీ మంత్రిని చూస్తుంటే కోడిగుడ్డు గుర్తుకు వచ్చే పరిస్థితి నెలకొంది.
నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా వచ్చిందా?
తెదేపా హయాంలో కియా, ఫాక్స్‌కాన్ సంస్థలు వచ్చాయి. జగన్ తరిమేసిన కంపెనీలను తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం కష్టం. ఏపీలో ఉన్న కంపెనీలకు ముందు నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. ముందు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉంటేనే మరిన్ని సంస్థలు ఏపీకి వస్తాయి.ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతాం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ బ్రాండ్ విలువ పెంచే విధంగా కొత్త పాలసీలు తీసుకొస్తాం. ఎన్నో కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం విధానంతో ముందుకు వెళ్తున్నాయి. అది ముందుగానే ఆలోచించి ఫైబర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభించారు చంద్రబాబు. ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలు చేసి ఒక్క ఆధారం కూడా జగన్ చూపించలేకపోయారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అవహేళన చేసిన వాళ్లు.. ఇప్పుడు ఐటీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.