- లోకేష్ టార్గెట్‌గా ఎన్టీఆర్ అభిమానుల ప్లెక్లీ వార్ !
- ఎవరి అభిమానులు వారే, ఎవరి పాలిట్రిక్స్ వారివే !
- ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే టీడీపీకి మైనస్సే !
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌కు బిత్తరపోయే దృశ్యం కనిపించింది. ఒంగోలులో లోకేష్‌కు రaలక్ ఇస్తూ కొందరు తెలుగు తమ్ముళ్లే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను హైలెట్ చేస్తూ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు.. ‘‘అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే’’ అంటూ ప్రధాన కూడళ్ళలో వాటిని ఏర్పాటు చేశారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆరే సీఎం అవుతాడంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఫ్లెక్సీని చూసి ఉలిక్కిపడ్డ లోకేష్ అనుచరగణం దానిని తొలగించే యత్నం చేసింది. బహుశా ఇది జూనియర్ ఫ్యాన్స్ పని అయ్యి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఇదే ఫ్లెక్సీ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్(స్వర్గీయ) ఫొటోతో పాటు .. లోకేష్ తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ కూడా ఉండడం గమనార్హం. ఇక లోకేష్‌ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగుదేశం అభిమానుల యందు ఎన్టీఆర్ అభిమానులు వేరయా !
గతంలో చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని టీడీపీ కార్యకర్త ఒకరు చంద్రబాబును కోరారు. దీంతో చంద్రబాబు టీడీపీ కార్యకర్తకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబునాయుడు పర్యటన సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న జెండాలతో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశాయి. మరో వైపు చిలకలూరిపేటలో గత ఏడాది అక్టోబర్ మాసంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో కూడ చంద్రబాబు ఇదే రకమైన అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ జెండాలు, ప్లెక్సీలతో చంద్రబాబు ర్యాలీలో రచ్చ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.గత కొంతకాలంగా అవకాశం వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ర్యాలీల్లో రచ్చ చేస్తున్నారు. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు, జెండాలను ప్రదర్శిస్తున్నారు.
గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేయటం లేదు.
హరికృష్ణ మరణించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుకు మరింత గ్యాప్ పెరిగిందనే ప్రచారం లేకపోలేదు. హరికృష్ణకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మధ్య మంచి అనుబంధం ఉందని చెబుతారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలను నందమూరి కుటుంబం తీవ్రంగా ఖండిరచింది. ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. పేరు ప్రస్తావించకుండానే జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని లోకేష్ ఏపీ రాష్ట్రంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే అంటూ ఆ ఫ్లెక్సీలో ఉంది. రాజకీయంగా లోకేష్ కు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లోకేష్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారనే ప్రచారం కూడ లేకపోలేదు. మరోవైపు బీజేపీ
ఇంటా బయట ఇబ్బందికర పరిణామాలు !
ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను పురంధేశ్వరి చేపట్టారు. ఈ పరిణామం కూడ టీడీపీ చీఫ్ చంద్రబాబుకు కొంత ఇబ్బందికర పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని టీడీపీ పరిష్కరించుకోకపోతే ఈ తలనొప్పులు కొనసాగే అవకాశం లేకపోలేదనే రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగా నారా, నందమూరి కుటుంబాల మధ్య గ్యాప్ లేదని చాటిచెప్పే ప్రయత్నం చేస్తే ఈ రకమైన తలనొప్పులకు చెక్ పడే అవకాశం ఉంది. ఈ దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తారా, జూనియర్ ఎన్టీఆర్ రానున్న ఎన్నికల్లో ఏ రకంగా వ్యవహరిస్తారోననేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మరోవైపు జనసేన పార్టీకి గ్రాఫ్ బాగా పెరిగిపోతుంది.వారాహి యాత్ర కు ముందు వారాహి యాత్ర తరువాత అన్నట్లు పవన్ గ్రాఫ్ పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగిన ఆశ్చర్యం లేదు అన్నట్లు ఉంది. జనసేన బలం పెరుగుతుండడంతో అధికార పార్టీ వైస్సార్సీపీ సైతం టిడిపిని పక్కకు పెట్టి జనసేన పైనే ఫోకస్ చేస్తుంది. ఇదిలా ఉంటె..తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు లో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలువడం చర్చగా మారింది. అసలు రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ ఎన్టీఆర్ చెప్పకనే చెపుతుంటే, అభిమానులు మాత్రం ఆయన్ను రాజకీయాల్లో ఆహ్వానిస్తున్నారు.