TDP Graph In Political Ground : తెలుగుదేశం గ్రాఫ్‌ పెరిగిందా ? పడిపోయిందా ?

0

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది కానీ.. అది జగన్‌ను సిఎం కాకుండా ఆపేంత స్థాయిలో లేదు అనే టాక్‌ సర్వత్రా వినిపిస్తోంది. అదేలా అంటే సంక్షేమ పథకాలే మళ్ళీ జగన్‌ను సిఎంను చేయబోతున్నాయని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన టైమ్స్‌నౌ` నవభారత్‌ సర్వేలోనూ ఏకంగా 24 నుండి 25 ఎంపీ సీట్లు వైసీపీ సాధించబోతోందని అంచనా కట్టారు. అంటే దాదాపు 170 ఎమ్మేల్యే సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లే. మరో సర్వే సంస్థ పోల్‌స్ట్రాటజీ గ్రూప్‌ సర్వేలోనూ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తే మాత్రం 57 % ఓటింగ్‌తో వైపీపీదే అధికారం అని తేల్చి చెప్పింది. టిడీపీకి 37%, జనసేనకు 7% సాధిస్తుందని తెలిపింది. టిడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా 49% ఓటింగ్‌తో వైపీపీ అధికార పీఠానికి ఏమాత్రం ఢోకా లేదని బాంబు పేల్చింది. ఈ దెబ్బతో ప్రతిపక్ష పార్టీల్లో కలవరం మొదలైంది. కొందరు మాత్రం టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం టఫ్‌ ఫైట్‌ ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు బీజేపీ తోడైతే మాత్రం వైసీపీని నిలువరించగలరని మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి టీడీపీ ఒక్కటే వెళితే ఏంటన్న ప్రశ్నకు మాత్రం సమాధానమిచ్చే వారు కరువవుతున్నారు. ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. అంటే టీడీపీ గ్రాఫ్‌ ఏ మాత్రం పెరగలేదన్న మాట.

చంద్రబాబు ఒక్కడే కష్టపడితే చాలదు...

అయితే అపర చాణిక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు తన వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఏర్పడిరది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పార్టీని ఎన్నో సార్లు చంద్రబాబు గట్టెంక్కించారు. 2004 నుంచి పదేళ్ల పాటు అధికారానికి దూరమైనా టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. 2009లో ప్రజారాజ్యం ఆవిర్భావ సమయంలో సైతం సీనియర్లు పార్టీని వీడినా మనోధైర్యంతో ముందుకు సాగారు. అయితే నాటి పరిస్థితులు వేరు. నేడు వేరు. అప్పట్లో చంద్రబాబు వ్యూహాలు పనిచేశాయి. కానీ ఇప్ఫుడు బలమైన ప్రత్యర్థి ముందు చంద్రబాబు వ్యూహాలు తేలిపోతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా టీడీపీ గ్రాఫ్‌ ఏమాత్రం పెరగటం లేదన్నది వాస్తవం. లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రజల్లో ఏమాత్రం ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయటం లేదు. బాదుడే బాదుడుతో ప్రజల్లో అంతగా స్పందన లేదు. ఇక భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో పథకాలు రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్ళిన టీడీపీ మైలేజీ పెరగటం లేదు. పాదయాత్రకు వచ్చే వాళ్ళందరూ ఓట్లేస్తారని గ్యారెంటీ ఎక్కడా లేదు. అది తాత్కాలికమే. పార్టీ పరిస్థితి చూసి ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. పార్టీ నాయకుడైన చంద్రబాబు సమర్థత మీద నమ్మకం ఉన్నా, ఆయన టీమ్‌ సభ్యులపై ఉన్న వ్యతిరేకత కొంప ముంచే అవకాశం ఉంది. టిడీపీ నుండి పోటీ చేసే అభ్యర్థులు, ఇన్‌ఛార్జ్‌లు అందరూ గత 15 నుండి 20 ఏళ్ళ వరకు టీడీపీలో చూస్తున్న ముఖాలే. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువ మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నవారే. నిజాయితీ పరులను వేళ్ళ మీద లెక్కించుకోవల్సిందే. ఈ సారి గెలవాలంటే మాత్రం పూర్తిగా వ్యూహాల్ని మార్చుకోవల్సిన అవసరం ఉంది. అంగబలం, ఆర్థిక బలంతో పాటు పార్టీ నాయకుడి ఆలోచనల్ని అర్థం చేసుకుని దూసుకుపోయే స్వభావం ఉన్న కొత్త తరం నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఏంతైనా ఉంది. అభ్యర్థుల ఎంపికలో ప్రక్షాళన చేపట్టాల్సిందే. కఠినమైన నిర్ణయాలు తీసుకోవల్సిందే. ఏ మాత్రం పాత నిర్ణయాలు పునరావృతమైనా మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చోవలసి ఉంటుందని లోకేష్‌కి, చంద్రబాబుకు తెలుసు. పోల్‌ స్ట్రాటజీ మారింది. పాత తరం ఆలోచనలకు కాలం చెల్లింది. డిజిటల్‌ యుగంలో మరింత స్మార్ట్‌గా వ్యవహరించాల్సి ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రకం ఆలోచనలతో ముందుకు రావాల్సి ఉంది. 



పొత్తులు గట్టెక్కిస్తాయా ? 

ప్రస్తుతం ఏపీలో టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. అందునా అధికారంలో ఉంది. ఎక్కడా లేని దూకుడు ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని పలు సర్వే పల్స్‌ చెబుతున్నాయి. వైసీపీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలోనూ అధికారం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళను ఏ మాత్రం ఉపేక్షించటం లేదు. నిర్ధాక్షిణ్యంగా పార్టీ నుండి బహిష్కరిస్తున్నారు. బహిష్కరించిన నాయకుల ద్వారా పార్టీకి జరిగే నష్టాన్ని కచ్చితమైన అంచనా వేస్తున్నారు. పార్టీకి అన్ని విధాల లాభం చేకూర్చే మరో ధీటైన అభ్యర్థితో భర్తీ చేస్తున్నారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలను చేర్చుతున్నారు. సామాజిక వర్గాల సమీకరణలను సరిచేస్తూ వ్యూహాలను మార్చుకుంటూ పైచేయి సాధిస్తున్నారు. ఎన్నికల సంవత్సరంలో ప్రజలకు మరిన్ని పథకాలతో పాటు తాయిలాలతో ఆకట్టుకునేందుకు జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు పాలన చూశారు, జగన్‌ పాలన చూశారు. ప్రజలు గెలిపించాలని డిసైడ్‌ అయితే జగన్‌కు మెజార్టీ సీట్లను ఇచ్చి గెలిపించగలరు. అదే వ్యతిరేకతంగా ఉంటే టీడీపీకి పట్టం కట్టి మరోసారి అధికారంలోకి తీసుకురాగలరు. ప్రజల నాడి కనిపెట్టడం అసాధ్యం. వారిని ఆకట్టుకోవటం మార్గం. ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. తన బలం సరిపోదు అనుకున్నప్పుడు చంద్రబాబు కచ్చితంగా పొత్తుల కోసం పాకులాడుతారు. అయితే ఆ పొత్తుల కోసం ఏ పక్షం ముందుకు రానప్పుడు ఒంటరిగానైనా పోటీచేసి గెలిచే సత్తా బాబుకు ఉండాలి. అప్పుడే రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతారు. లేదంటే పొత్తుల కోసం చూస్తే టీడీపీ దీనంగా ఎదురుచూసే పరిస్థితి ఉంటే మరింత స్థాయి దిగజారడం ఖాయం. నిజానికి ఏపీలో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలైన టీడీపీ బలం ఎంత మాత్రం సరిపోదు. అందుకే జనసేనతో టీడీపీ కలిస్తే ఖచ్చితంగా వైసీపీని ఓడిరచే అవకాశాలుంటాయి. అయితే ఈ పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది మాత్రం ప్రస్తుతం పవన్‌ చేతుల్లో ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే బంతిని పవన్‌ కోర్టులోకి నెట్టారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా గెలవలేమని చంద్రబాబు డిసైడ్‌ అయ్యారు. మరి పవన్‌ నిర్ణయానుసారం ఏపీలో వచ్చే ఎన్నికల వాతావరణం ఉండనుంది. వైసీపీని ఓడిరచడానికి చంద్రబాబుతో పవన్‌ కలుస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !