YS Viveka Case : వివేక హత్య కేసులో మరో కోణం ఉంది...అవినాష్‌రెడ్డి ఎదురుదాడి !

0

 

వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దాదాపు రెండేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ఎదురుదాడి మొదలుపెట్టారు. హత్యకేసును గతంలో దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్‌ సింగ్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు అవినాష్‌ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో రామ్‌ సింగ్‌పై ఎంపీ అనేక ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కుటుంబ ఆస్తి వివాదాలే ప్రధాన కారణమని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ హత్య చేయించారని ఆరోపించారు. వివేకా తన రెండో భార్య షమీమ్‌, ఆమె కుమారుడి పేరిట రాసిన నోటరీ వీలునామాను నిందితులు నర్రెడ్డి కుటుంబానికి అందచేశారని తెలిపారు. షమీమ్‌కు వాటా ఇవ్వకుండా వివేకా ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్‌ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.గ తంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్‌ దురుద్దేశపూరితంగా ఈ అంశాలపై దర్యాప్తు చేయకుండా పక్కదారి పట్టించారన్నారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించటానికి మూడున్నర నెలల ముందు నుంచే రాంసింగ్‌ దర్యాప్తు చేపట్టడం, సాక్షులు చెప్పినదానికి భిన్నంగా వాంగ్మూలాలను నమోదు చేయడాన్ని ప్రస్తావించారు. తనకు సంబంధం లేకపోయినా కావాలనే ఎస్పీ తనను ఇరికించి ఇమేజ్‌ని దెబ్బ తీసినట్లు అవినాష్‌ మండిపోయారు. 

పక్షపాత ధోరణితోనే దర్యాప్తు !

వివేకా హత్య విచారణ సందర్భంగా తన అనుమానాలను వ్యక్తం చేసినా ఎస్పీ ఏ రోజూ పట్టించుకోలేదన్నారు. తన ప్రమేయముందని చెప్పాలంటూ సాక్ష్యులను బెదిరించినట్లు ఆరోపించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డిని రామ్‌ సింగ్‌ చిత్రహింసలకు గురిచేసినట్లు చెప్పారు. కుటుంబ గొడవలు, ఆస్తుల తగాదాలు, రెండో భార్య షమీమ్‌ పేరుతో రాసిన ఆస్తిపత్రాల కోసమే వివేకా హత్య జరిగి ఉంటుందని తాను ఎన్నిసార్లు చెప్పినా రామ్‌ సింగ్‌ పట్టించుకోలేదన్నారు. అలాగే మున్నా లాకర్లో డబ్బున్న విషయాన్ని సీబీఐకి ఎవరు చెప్పారో చెప్పాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. పక్షపాత వైఖరితో రామ్‌ సింగ్‌ చేసిన దర్యాప్తును సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు.దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్‌ సింగ్‌ దర్యాప్తు చేసినట్లు అవినాష్‌ ఆరోపించారు. రెండో వివాహం, బెంగుళూరులో ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ లాంటి కారణాలతోనే వివేకా హత్య జరిగి ఉండొచ్చు తన అనుమానాలను ఎస్పీ పట్టించుకోలేదన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే హత్య దర్యాప్తు విషయంగా సీబీఐ దాఖలుచేసిన చివరి రెండు చార్జిషీట్ల ఆధారంగానే రామ్‌ సింగ్‌పై అవినాష్‌ ఫిర్యాదు చేశారు. సీబీఐ చార్జిషీట్లలో అవినాష్‌ పాత్రకు ఆధారాలు లేవన్నట్లుగానే చెప్పింది.వివేకా హత్య జరిగిన కొద్దిసేపటికే నిందితులు అవినాష్‌ ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ఆధారంగా తాము ఎంపీని కూడా అనుమానించినట్లు సీబీఐ చెప్పింది. అయితే గూగుల్‌ టేక్‌ అవుట్‌ చూపించిన సమయాన్ని రీడ్‌ చేయటంలో తాము తప్పు చేసినట్లు చార్జిషీట్లో సీబీఐ అంగీకరించింది. మొదట్లో సీబీఐ ఆరోపించిన ప్రకారం నిందుతుల్లో కొందరు అవినాష్‌ ఇంట్లో తెల్లవారుజాము 2.30 గంటలకు ఉన్నారు. అయితే గూగుల్‌ టేక్‌ అవుట్‌ సమయాన్ని భారత కాలమానం ప్రకారం లెక్కిస్తే ఉదయం 8.00 గంటలుగా అర్థమైందన్నారు. సీబీఐ తాజా చార్జిషీట్‌ ప్రకారం అవినాష్‌ పాత్ర లేదని దాదాపు సీబీఐ అంగీకరించినట్లే అనుకుంటున్నారు. అందుకనే అవినాష్‌ డైరెక్టర్‌కు ఎంపీ ఘాటు లేఖ రాశారు. మరి డైరెక్టర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరోసారి దర్యాప్తా...జరుగుతుందా ?

రాంసింగ్‌ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశాలను పునఃసమీక్షించి ఐపీసీ 457, 460, 394, 398, 302 సెక్షన్ల కింద సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్‌ 30 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐకి గడువు నిర్దేశించింది. అంటే అప్పటిలోగా సీబీఐ తుది చార్జీషీట్‌ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూన్‌ 19న సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి ఈ లేఖను రాశారు. సీబీఐ నమోదు చేసి న్యాయస్థానానికి సమర్పించిన సాక్షుల వాంగ్మూలాలు, అంతకు ముందు ఛార్జ్‌షీట్లలో పేర్కొన్న అంశాలను విశ్లేషించిన అనంతరం తాను సహేతుకంగా ఈ సందేహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీబీఐ గత గత ఛార్జ్‌ షీట్ల లో విస్మరించిన కీలక అంశాలను పునసమీక్షించి సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !