Aakash BYJU'S Student Controversy Death in Vizag : ఆకాష్‌ బైజూస్‌ స్టూడెంట్‌ రితీసాహా మరణం కేసులో కీలక మలుపు !

0

 


ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు  విశాఖ నగర పోలీస్‌ శాఖలో ప్రకంపనలు రేపుతోంది. తమ కుమార్తెది హత్యేనని, కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించడం సంచలనంగా మారింది. విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విద్యార్థిని రితీ సాహా హాస్టల్‌ భవనం పైనుంచి పడి మృతి చెందితే.. పశ్చిమ బెంగాల్‌లో నేతాజీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఆ కేసు వివరాలిలా ఉన్నాయి.పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితీ సాహా విశాఖలోని ఆకాష్‌ బైజూస్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ కాలేజీకి అనుసంధానంగా నెహ్రూబజార్‌ ప్రాంతంలో ఉన్న సాధనా హాస్టల్‌లో ఉండేది. ఈ క్రమంలో గత నెల 14న హాస్టల్‌ 4వ అంతస్తు పైనుంచి దూకి చనిపోయిందని తల్లిదండ్రులకు హాస్టల్‌ యాజమాన్యం సమాచారమిచ్చింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు విశాఖకు వచ్చి విగత జీవిగా ఉన్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. అయితే విద్యార్థిని మరణానికి గల కారణాలపై హాస్టల్‌ సిబ్బంది, పోలీసులు పొంతన లేకుండా చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది. ఒకసారి ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని, మరోసారి దూకేసిందంటూ చెప్పుకొచ్చారు.

సీసీ ఫుటేజ్‌లతో మరిన్ని అనుమానాలు

అయితే తమ కుమార్తె ప్రమాదవశాత్తూ కిందపడలేదని, ఎవరో పై నుంచి తోసేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు వారు ఫిర్యాదు చేయగా, అటువంటి ఆధారాలేవీ తమకు లభించలేదని పేర్కొంటూ పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగానే కేసు నమోదుచేశారు. అయితే స్టేషన్‌లో మహిళా పోలీస్‌ అధికారులు ఉన్నా కనీసం మృతదేహంపై గాయాలేవైనా ఉన్నాయా? లేదా? అనే విషయం గుర్తించే ప్రయత్నం చేయలేదని, తమ అనుమానాలను నివృత్తి చేయకుండానే పోస్టుమార్టం చేయించారంటూ బాధిత కుటుంబ సభ్యులు అప్పుడే నిలదీశారు.  రీతి సాహా మృతిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుండడంతో ఆమె తల్లిదండ్రులు హాస్టల్‌లో ఉన్న సీసీ కెమెరాలనే కాకుండా దాని ఎదురుగా ఉన్న భవనం సీసీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించారు. రితీ సాహా నాలుగో అంతస్తు పైకి వెళ్లే సమయంలో ఒక డ్రెస్‌లో ఉండగా.. కింద పడి ఉన్న మృతదేహంపై మరో కలర్‌ డ్రెస్‌ ఉందని గ్రహించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులపై నమ్మకం లేదంటూ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం సీరియస్‌ అవడంతో పాటు మంత్రి అనూప్‌ను ఏకంగా రితీ సాహా ఇంటికి పంపించారు. అంతే కాకుండా సీఎం ఆదేశాలతో అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదు చేశారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో సంఘటన జరిగితే మరో రాష్ట్రంలో కేసు నమోదు కావడం అరుదు. కానీ రితీ సాహా అనుమానాస్పద మృతిపై బెంగాల్‌లో కేసు నమోదు కావడం చర్చకు దారితీస్తోంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్‌ పోలీసులు నగరానికి రానున్నట్టు పోలీస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆకాష్‌ బైజూస్‌ యాజమాన్య ప్రతినిధులను నిందితులుగా పేర్కొన్నారా? లేకపోతే ఫోర్త్‌ టౌన్‌ పోలీసులపై కూడా అభియోగాలు నమోదు చేశారా?...అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 

కేసును నీరుగార్చే ప్రయత్నం?

రితీ సాహాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆకాష్‌ బైజూస్‌ కాలేజ్‌, హాస్టల్‌ నిర్వాహకుల నుంచి స్థానిక పోలీసులు డబ్బులు తీసుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ సి.ఎం.త్రివిక్రమ్‌ వర్మకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డీసీపీ విద్యాసాగర్‌నాయుడును ఆదేశించినట్లు సమాచారం.

వారంలో ఫోరెన్సిక్‌ నివేదిక

ఈ కేసుపై డీసీపీ` 1 విద్యాసాగర్‌నాయుడును మీడియా ప్రశ్నించగా.. రితీ సాహా మృతిపై సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. యువతి ఒంటరిగానే మెట్లు ఎక్కుతూ భవనం పైకి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయిందన్నారు. మేడపైకి వెళ్లినప్పుడు యువతి తప్ప మరెవరూ ఉన్నట్టు సీసీ కెమెరాల్లో కనిపించలేదన్నారు. ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా కేసు నమోదుచేయడంలో ప్రస్తుతానికి ఎలాంటి తప్పిదం కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టంతో పాటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పరీక్షకు కూడా పంపించామన్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక మరో వారం రోజుల్లో వస్తుందని దాని ప్రకారం తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేశారు.

విద్యార్థిని మృతి కేసులో బిగుస్తున్న ఉచ్చు..సీఐ, ఎస్‌.ఐ.లపై చర్యలు?

నెహ్రూబజార్‌లోని ఆకాష్‌ బైజూస్‌ కళాశాల హాస్టల్‌లో మేడపై నుంచి పడి కోల్‌కతాకి చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణంపై పోలీసులకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. తమ కుమార్తె హత్యకు గురైందంటూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళిన నాల్గవ పట్టణ పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోగా, విద్యార్థిని మృతిని ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నాల్గవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఎస్‌.ఐ.తో కలిసి కళాశాల యాజమాన్యం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొంది వాస్తవాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో కోల్‌కతాలో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కేసుకు సంబంధించి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తుండటంతో వాస్తవాల్ని వెలికితీసేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ ఓ ఉన్నతాధికారిని దర్యాప్తు అధికారిగా నియమిస్తున్నట్లు కమిషనరేట్‌ వర్గాలు చెబుతున్నాయి. స్టేషన్‌ అధికారి, ఎస్‌.ఐపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అసలు ఆ రోజు ఏమైంది, ఆ యువతే ఆత్మహత్య చేసుకుందా..? లేకపోతే ఆమెను హత్య చేసి పై అంతస్తు నుంచి తోసేశారా? అనే విషయాలు తేలాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !